కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ -2 కు సరికొత్త విధి విధానాలను ఇవ్వడం ద్వారా ఏపీ హక్కులకు విఘాతం కలుగుతుందని సిఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆందోళనను అర్ధం చేసుకొని దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కృష్ణా ట్రిబ్యునల్ కు సరికొత్త మార్గదర్శకాలు రూపొందిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్య పరిచిందని జగన్ అన్నారు. ఈ ట్రిబ్యునల్ ను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జలాల పునః పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని, న్యాయపోరాటం చేస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్నదాతలకు అన్యాయం జరిగే ఎలాంటి ప్రతిపాదనలను ఒప్పుకోబోమని నిబంధనల ప్రకారం మన రాష్టానికి రావాల్సిన ప్రతి నీటిబొట్టునూ వాడుకుంటామని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా ప్రవర్తించబోమన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పటికే విధి విధానాలు ఉన్నాయని, ఇప్పుడు సరికొత్త విధానాలు ఇవ్వడం సరికాదని, దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు.