రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నేటి ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత 11.25 నుంచి 12.15 గంటల మధ్య పోరంకి మురళీ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్రపతికి ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. అనంతరం మధ్యాహ్నం 1.00 నుంచి 2.15 గంటల మధ్య రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆమె నౌకాదళ దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ బయల్దేరి వెళతారు.
విశాఖ కార్యక్రమం తరువాత ఈ రాత్రికి శ్రీమతి ముర్ము తిరుమల చేరుకుంటారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళతారు.