Red Cross Great: రెడ్‌క్రాస్ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరింపజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంస్ధ అనుసరిస్తున్న ఆదర్శప్రాయమైన మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తి చేయాలని అప్పుడే ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సేవలను అందుకోగలుగుతారన్నారు. “ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం” సందర్భంగా విజయవాడ రాజ్ భవన్ వేదికగా అదివారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుని హోదాలో కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డునాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుక జరుపుకుంటున్నామని, హెన్రీ బలమైన మూలాలను కలిగిన గొప్ప మానవతా సంస్థను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు.
ఈ సంవత్సరం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని “బీ హ్యూమన్ కైండ్” ధీమ్ తో జరుపుకుంటున్నామని, ఈ సందేశాన్ని రెడ్‌క్రాస్ సభ్యులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ కరోనా కష్ట సమయాల్లో మెరుగైన పనితీరుతో నిరుపేదలకు అవసరమైన సమయంలో సహాయం చేసిందని, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని గవర్నర్ అన్నారు. కరోనా పట్ల అవగాహన కల్పించడం, పేస్ మాస్కులు, హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ల పంపిణీ, అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌లను అందించడం వంటి చర్యలు అభినందనీయమన్నారు. కరోనా వేళ ఆకలితో అలమటిస్తున్న నిరాశ్రయులకు ఆహారాన్ని పంపిణీ చేయటమే కాక, వారు స్వస్ధలాలకు సురక్షితంగా చేరుకునేలా రెడ్ క్రాస్ సేవలు అందించిందన్నారు. రెడ్‌క్రాస్ శతాబ్ది వార్షిక సైకిల్ ర్యాలీ ప్రజలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిందన్నారు.
రెడ్ క్రాస్ నేతృత్వంలో కాకినాడలో ఏర్పాటు చేసిన “వృద్ధాశ్రమం”ను గవర్నర్ రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఆశ్రమం ఏర్పాటుకు చొరవ చూపిన జిల్లా కలెక్టర్ డాక్డర్ కృతికా శుక్లా, జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ వైడి రామారావులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నూతనంగా ఏర్పాటు చేసిన తలసేమియా సెంటర్ ను కూడా అయన ప్రారంభించారు. సైతం ప్రారంభించగా, కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ పాడేరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్డు అంబులెన్స్ ను గవర్నర్ రాజ్ భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఎ.కె. పరిడా అంకితభావం, నిబద్ధతతో కూడిన సేవలను అందిస్తున్నారన్నారు. మంచి పనితీరు కనబరిచిన రెడ్ క్రాస్ బాధ్యులను గవర్నర్ అభినందించి దృవీకరణ పత్రాలను పంపిణీ చేసారు. డాక్టర్ శ్రీధర్ గత రెండు సంవత్సరాల రెడ్ క్రాస్ కార్యక్రమాల నివేదికను అందించి భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు పాల్గొన్నారు.