వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టులో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రభుత్వం ఆదేశించింది. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు కారణమౌతున్నారని పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చట్టపరంగా దీనిపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1973 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పరువునష్టం దావా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సూచించింది. ఈ మేరకు GO Rt. No. 16 ను నేడు విడుదల చేసింది. ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టైమ్స్ అఫ్ ఇండియా దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఈ జీవోలో ప్రస్తావిస్తూ దీనిపై పవన్ ను ప్రాసిక్యూషన్ కు కావాల్సిన తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేరిట ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.