ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్లుల కోసం దాఖలైన మొత్తం రెండు వేల పైచిలుకు పిటిషన్లలో 1013 పిటిషన్లకు సంబంధించిన తుది తీర్పు నేడు వెలువరించింది, నాలుగు వారాల్లోగా విధిగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే కొంత మేరకు బిల్లులు చెల్లించిన వాటికి కూడా 12 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని నిర్దేశించింది. ఉపాధి హామీ పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పించిన నెలరోజుల నుంచీ పేమెంట్ చేసేరోజు వరకూ ఏటా 12 శాతం వడ్డీ చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
పనుల్లో నాణ్యతా లోపం ఉందంటూ కొన్నిటికి 21, మరికొన్నింటికి 6 శాతం మినహాయించుకొని బిల్లులు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు సర్క్యులర్లను హైకోర్టు కొట్టివేసింది. ఉపాధి హామీ పనుల్లో విజిలెన్స్ విచారణకు సంబంధించిన పెండింగ్ కేసులేవీ తమ వద్ద లేవని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనితో ఈ సర్క్యులర్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి భట్టు దేవానంద్ నిర్ణయం వెలువరించారు.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఒక కేసులో 1013 పిటిషన్లకు సంబంధించి ఒకే కామన్ ఆర్డర్ ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అని న్యాయ నిపుణులు, న్యాయవాదులు పేర్కొంటున్నారు.