Monday, November 25, 2024
HomeTrending Newsనాకు జన్మ సంస్కారం ఉంది: సుచరిత

నాకు జన్మ సంస్కారం ఉంది: సుచరిత

దళితజాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నట్లు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, తన మీద టిడిపి నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. తనకు జన్మ సంస్కారం ఉందని, అయ్యన్న వాడిన తరహా భాషను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా సుచరిత అనే నేను ఉపయోగించలేనని ఉద్వేగంతో చెప్పారు. మనిషికి గొప్పతనం అనేది ప్రవర్తన బట్టి వస్తుంది కానీ, పుట్టిన కులాన్ని బట్టి, జాతిని బట్టి రాదన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ తనకు ఏంతో గౌరవం ఇచ్చి, రాజ్యంగబద్ధంగా ఎమ్మెల్యేగా గెలిచిన దళిత మహిళనైన నాకు హోం శాఖ కట్టబెట్టారని, దానిపై ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు.  రాజకీయాల్లో తానెప్పుడూ దురుసుగా మాట్లాడలేదని, ఆశుద్ధంపై రాయివేయడం తనకు ఇష్టం లేదని, అయినా టిడిపి శ్రేణులు అతిగా స్పందిస్తున్నారని అందుకే మీడియా ముందుకు వచ్చానని సుచరిత స్పష్టం చేశారు.

అయ్యన్నపాత్రుడు సంస్కార హీనుడని, గతంలో కూడా ఓ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అయన సమాజానికి పట్టిన ఓ చీడగా సుచరిత అభివర్ణించారు. పోలీసు శాఖ పనితీరు మీద, వ్యవస్థలో లోపాలపై మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదని ఆమె హితవు పలికారు.

ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలని, మీరు బాగా పరిపాలించి ఉంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని, మీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులు, నేరాలు మీకు గుర్తులేవా ఆమె ప్రశ్నించారు.  ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ పై దాడి జరిగితే కోడి కత్తి అని ఎగతాళి చేశారని హోం మంత్రి గుర్తు చేశారు.  రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని జాతీయ లెక్కలు చెబుతుంటే, మాస్క్ లేనివారిపై నమోదు చేసిన కేసులు కూడా కలిపి రాష్ట్రంలో క్రైమ్ 65 శాతం పెరిగిందంటూ తెలుగుదేశం పార్టీ  దుష్ప్రచారం చేస్తోందని సుచరిత వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్