తనకు ఏపీ ఒక్కటే ప్రాధాన్యమని, ఇక్కడి ప్రజల పైనే తన మమకారం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. ఇటీవల చంద్రబాబు ఖమ్మం బహిరంగ సభ పై పరోక్షంగా ప్రస్తావిస్తూ తన నివాసం ఇక్కడేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో దాదాపు 900 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు, పవన్ లపై జగన్ విమర్శలు గుప్పించారు.
“చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపొతే ఆ రాష్ట్రమనో, ఈ పార్టీ కాకపొతే మరో పార్టీనో అని నేను అనడం లేదు, చంద్రబాబు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపొతే మరో భార్య అని కూడా నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడ ఉన్న ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా నినాదం” అంటూ ప్రకటించారు.
ఎన్నికలు వస్తుంటాయి- పోతుంటాయని …కానీ నాయకుడు ప్రజలకు మంచి చేస్తే చనిపోయిన తరువాత కూడా వారి గుండెల్లో స్థానం ఉంటుందని,దానికోసమే మీ బిడ్డ పాకులాడతాడు అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మరో 18నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని.. దేవుణ్ణి అంటూ వెల్లడించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98శాతం పూర్తి చేసిన తరువాత ప్రతి కార్యకర్తా ప్రతి గడప వద్దకూ వెళ్లి ధైర్యంగా చెప్పగలుగుతున్నామని చెప్పారు.