జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన మూడు పెళ్ళిళ్ళ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం లేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలిన్చుకోవచ్చనే విధంగా మీరు ఇచ్చిన సందేశంతో మహిళా లోకం షాక్ కు గురైందని పేర్కొన్నారు. ఈ మేరకు మహిళా కమిషన్ పవన్ కల్యాణ్ కు నోటీసు జారీ చేసింది. మాటల్లో తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారని ఇన్ని రోజులూ మహిళా కమిషన్ ఎదురు చూసిందని, అయినా సరే ఆ వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వలేదని, క్షమాపణలు కూడా చెప్పలేదని ఆమె అభ్యంతరం తెలిపారు.
పవన్ తన ప్రసంగంలో స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్రఆక్షేపణీయమని, మహిళను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇలాంటి పదాలు వాడతారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎందరో మహిళలకు తమకు ఫిర్యాదు చేశారని, తక్షణమే దీనిపై క్షమాపణ చెప్పి, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పద్మ సూచించారు.
Also Read : వైసీపీ ముక్త ఆంధ్ర ప్రదేశ్ మా నినాదం : పవన్