పర్యావరణ పరిరక్షణ కోసం మనం నాటుతున్న మొక్కలు చెట్లుగా మారితేనే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి; అటవీ, పర్యావరణం, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘జగనన్న పచ్చతోరణం’పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను పెద్దిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ కోటి మొక్కలు నాటడం కాదు, అవి బతికి చేతలుగా మారితేనే ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. చాలా ఏళ్ళుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా మనం ఆశించిన ఫలితాలు నెరవేరలేదని అభిప్రాయపడ్డారు. 33 శాతం పచ్చదనం ఇంకా చేరుకోలేదన్నారు. నాటిన మొక్కలను కొన్నాళ్లపాటు జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఉందని, దానిపై దృష్టి పెట్టాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు. రాబోయే రెండు మూడు నెలల్లో జగనన్న పచ్చతోరణం పథకంపై ప్రత్యేక దృషి పెట్టాలని ఆదేశించారు.
ఈ వర్క్ షాప్ లో సోషల్ ఫారెస్ట్ హెడ్, పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, ఇఎఫ్ఎస్టి చలపతి, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్, సెర్ప్ సిఇఓ. రాజాబాబు, నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య, 13 జిల్లాల నుంచి డ్వామా పిడి, ఎపిడి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.