Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅరవై ఏళ్ల అందం

అరవై ఏళ్ల అందం

‘కన్నెతనం వన్నె మాసి…
ప్రౌఢత్వం పారిపోయి…
మధ్యవయసు తొంగిచూసిన
ముసలి రూపు ముంచుకురాదా!’
అన్న మార్చి రాయలేమో!

అందాల పోటీలంటే…తళుకు బెళుకులు, వయ్యారి భామలు అనుకుంటాం. ఆ ప్రపంచంలో మనకేం పని అనుకోడమూ సహజమే. మరి “అరవయ్యేళ్లు!”- ఈ మాట వింటేనే పెద్దవాళ్ళయి పోయామంటూ నిట్టూరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాలామంది అనారోగ్య సమస్యలతో, పిల్లలు, మనవళ్ల పనులతో గడిపేస్తూ ఉంటారు. అసలీ ఇల్లు, పిల్లలు, భర్త … వీరి పనుల నుంచి విశ్రాంతి దొరుకుతుందా అనిపిస్తుంది. కానీ సాధించాలన్న తపన ఉండాలే గానీ అరవైలో ఉంటేనేం? అందాలపోటీ అయినా సరే, తగ్గేదే లే అని కొందరు నిరూపిస్తూ ఉంటారు.

తాజాగా ఆర్జెంటినాకు చెందిన మహిళ అరవయ్యేళ్ళ వయసులో అందాల రాణిగా ఎంపికై ప్రపంచ చరిత్ర సృష్టించింది . అందుకే అందానికి అందం ఈ పుత్తడి బామ్మ అని సంబరంగా పాడేసుకుంటున్నారు ఆర్జెంటినావాసులు. లేకపోతే ఏంటి? ఇన్నేళ్ళుగా 18 నుంచి 28 ఏళ్ళవాళ్ళు మాత్రమే అందాల పోటీలో పాల్గొనాలనే నిబంధన వల్ల ఎందరో తెలివైన, అందమైన మహిళలకు అన్యాయం జరిగినట్టే కదా!

ఆ మాట కొస్తే మన భారతీయ హేమమాలిని, రేఖ ముందు ఎవరైనా నిలబడగలరా? ఏడు పదుల వయసులోనూ వీరు జోరుగా హుషారుగా ఉన్నారు. అఫ్ కోర్స్…పోటీ అక్కర్లేని అందగత్తెలు వీరు. ఆ విషయం పక్కన పెట్టి ఆర్జెంటినా దగ్గరికి వద్దాం. ఏంటి వీళ్ల సంబరాలకు కారణాలు? 60 ఏళ్ళ అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ అందాల రాణిగా ఎంపికైంది. త్వరలో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యే అవకాశం సాధించింది . విజయం చిన్నదే. కానీ వినూత్నం , చరిత్రాత్మకం. దేశవ్యాప్తంగా జరిగే పోటీల్లో విజయం సాధిస్తే మరో మెట్టెక్కినట్టే. ఇంతకీ అరవై ఏళ్ళ వయసులో మారిసా ఎందుకింత ధైర్యం చేసినట్టు?

చాలా కాలం పాటు మిస్ యూనివర్స్ పోటీలకు 18 -28 వయసు వారు మాత్రమే అర్హులు. ఈ ఏడాది నుంచీ ఆ నిబంధన మార్చి 18, ఆపై ఎంత వయసు వారైనా పోటీ చేసే అవకాశం కల్పించారు. అర్జెంటీనాలో చిన్న పట్టణం లా ప్లేటా మారిసా స్వస్థలం. మొదట జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించినా తర్వాత న్యాయశాస్త్రం చదివి ఒక ఆస్పత్రికోసం పని చేస్తున్నారు. మొదటినుంచీ చక్కని ఆరోగ్య స్పృహ ఉంది . మితాహారం, తగినంత వ్యాయామం అలవాటు.

చూడటానికి చక్కగా ఉంటుంది. అందం అనేది బాహ్యం కాదు. మనసుకు, తెలివితేటలకు సంబంధించిన విషయం అంటుంది. అందుకే మారిన నిబంధనలు ఉపయోగించుకుని తన తరానికి స్ఫూర్తిగా నిలవాలనుకుంది. 18 నుంచి 73 ఏళ్ళ వయసు వారు ఉన్న పోటీలో విజేతగా నిలిచింది. అందాల పోటీలంటే సాధారణంగా ఉండే అభిప్రాయాన్ని మార్చగలిగినందుకు సంతోషంగా ఉందనే అలెజాండ్రా మిస్ యూనివర్స్ గా ఎంపికైతే అది ఇంకో అద్భుతమే!

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్