Monday, February 24, 2025
HomeTrending Newsనాగాలాండ్ కల్లోలిత ప్రాంతాల్లో ఆంక్షలు

నాగాలాండ్ కల్లోలిత ప్రాంతాల్లో ఆంక్షలు

నాగాలాండ్ లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్ఎస్‎పీఏ) మరో ఆరు నెలలపాటు పొడగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చ్ 30 వరకు చట్టం అమలులో ఉంటుంది. నాగాలాండ్ లోని 9 జిల్లాలకు ఈ చట్టం వర్తిస్తుంది. దిమాపూర్, నియులాండ్, చుమౌకేడిమ, మోన్, కిఫైర్, నోక్లాక్, ఫెక్, పెరెన్, జున్హేబోతో జిల్లాల్లో అమలులో ఉంటుంది.

దీంతో పాటు మరో నాలుగు జిల్లాల పరిధిలోని 16 పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా ఈ చట్టం వర్తిస్తుంది. నాగాలాండ్ రాజధాని కొహిమ జిల్లా పరిధిలోని ఐదు పోలిస్ స్టేషన్, మొకొక్ చుంగ్ జిల్లా పరిధిలో ఆరు స్టేషన్లు, లోనగ్లేంగ్ జిల్లలో యంగ్లోక్ స్టేషన్, వోఖ జిల్లా పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్ లకు ఇది వర్తిస్తుంది.

1995 నుంచి నాగాలాండ్‌లోని అన్ని జిల్లాలు ఈ చట్టం పరిధిలో ఉన్నాయి. నాగాలాండ్‌ జిల్లాలను దశల వారీగా చట్టం పరిధి నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నాగాలండ్‌లోని ఏడు జిల్లాల పరిధిలోని 15 పోలీస్‌ స్టేషన్లను చట్టం పరిధి నుంచి తప్పించారు.

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి 84 ఏళ్ల చరిత్ర ఉంది. క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో 1942లో వలస పాలకులు మొదటి సారిగా ఆర్డినెన్స్‌ రూపంలో ఈ చట్టాన్ని తెచ్చారు. నెహ్రూ స్వతంత్ర భారతావనికి తొలి ప్రధానమంత్రి అయ్యాక ఈ ఆర్డినెన్స్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. 1958లో దానికి చట్టరూపం ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీరులో, ఉగ్రవాద సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో పంజాబ్‌లో కూడా ఈ చట్టాన్ని అమలు చేశారు. మొదట పంజాబ్‌ను, తర్వాత త్రిపుర, మేఘాలయలను చట్టం పరిధి నుంచి మినహాయించారు. నాగాలాండ్‌, మణిపూర్‌, అసోం, జమ్మూ కశ్మీరులతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో ఉంది.

ఈ చట్టంలోని మూడో సెక్షన్‌ కింద ఒక రాష్ట్రాన్ని లేదా రాష్ట్రంలో కొంత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. కేంద్రం కానీ, గవర్నర్‌ కానీ ఆ ప్రకటన చేయొచ్చు. దాంతో అక్కడున్న సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు వస్తాయి. అనుమానం వస్తే చాలు.. ఎక్కడైనా సోదాలు చేయొచ్చు. ఎవరినైనా వారెంటు లేకుండా అరెస్టు చేయొచ్చు. సొంత నిర్ణయంతో కాల్పులకు దిగొచ్చు. పొరపాటున ఎవరినైనా కాల్చిచంపినా సంబంధిత సాయుధ జవానుపై విచారణ జరపడానికి వీల్లేదు. అరెస్టు చేయడానికి వీల్లేదు. సాధారణ కాల్పులు జరిపే సమయంలో ప్రొటోకాల్‌ పాటించారా? అనేది పరిశీలిస్తారు. ఎవరినైనా అరెస్టు చేసినా 24 గంటల్లో స్థానిక పోలీసులకు అప్పగించాలి.

Also Read: ఈడీ దాడులు.. ఐటీ శాఖలో భారీ బదిలీలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్