Saturday, November 23, 2024
HomeTrending NewsLAC: సరిహద్దుల్లో చైనా ఆగడాలు

LAC: సరిహద్దుల్లో చైనా ఆగడాలు

చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్‌కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. బఫర్‌ జోన్ల విస్తరణకు సంబంధించి చైనా ప్రతిపాదనలు, అందుకు కేంద్ర ప్రభుత్వ స్పందనపై ‘టెలిగ్రాఫ్‌’లో ప్రచురితమైన కథనం ప్రస్తుతం సంచలనంగా మారింది.

బఫర్‌ జోన్లుగా మార్చుకుంటూ..
గల్వాన్‌ ఘర్షణ అనంతరం.. డెప్సాంగ్‌ మైదానాల్లోని గల్వాన్‌, పాంగాంగ్‌ త్సో, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌ వంటి వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కి వచ్చాయి. నిజానికి ఈ ప్రాంతాలు మన భూభాగంలోనివే. ఈ ప్రాంతాల్లో భారత ఆర్మీ గతంలో గస్తీ నిర్వహించేది. ఇప్పుడు కొంత పరిధిలోనే బఫర్‌ జోన్లుగా ఉన్న ఈ ప్రాంతాలను 15-20 కిలోమీటర్ల మేర విస్తరించి ఆ ప్రాంతాన్నంతా బఫర్‌ జోన్లుగా మార్చాలంటూ చైనా ఒత్తిడికి దిగింది. దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చాల్సిన కేంద్రం బుజ్జగింపులకు దిగింది. 15-20 కిలోమీటర్ల మేర కాదుగానీ.. 3-4 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో బఫర్‌ జోన్లకు ఓకేనంటూ ప్రతిపాదించింది. అయితే ఈ అభ్యర్థనను చైనా తిరస్కరించింది. ఈ మేరకు ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నట్టు ‘ది టెలిగ్రాఫ్‌’ తన కథనంలో వెల్లడించింది. ‘ఇది ఇలాగే కొనసాగితే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. భారత్‌ మరింత భూభాగాన్ని కోల్పోతుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రాంతాలను బఫర్‌ జోన్లుగా మార్చితే గస్తీ నిర్వహించడానికి భారత ఆర్మీకి అక్కడ అధికారం ఉండబోదని, ఆ ప్రాంతాలపై హక్కును మనం కోల్పోతామని, ఎల్‌ఏసీ రూపురేఖలు మారొచ్చని రక్షణరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు కూడా అంతే..
అరుణాచల్‌లోని 11 ప్రాంతాలకు చైనా గత నెలలో కొత్త పేర్లు పెట్టింది. కొత్త పేర్లు పెట్టడం వల్ల వాస్తవాలు మారవని కేంద్రం మొక్కుబడి ప్రకటన చేసింది. చైనా ఆగడాలకు కళ్లెం వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వచ్చాయి.

ఎల్‌ఏసీ వెంబడి చైనా గ్రామాల నిర్మాణం
వాస్తవధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి మధ్య, తూర్పు సెక్టార్ల పరిధిలో చైనా మాడల్‌ గ్రామాలను నిర్మిస్తున్నదని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సమీపంలో ఎల్‌ఏసీకి 11, 35 కిలోమీటర్ల దూరంలో 300-400 ఇండ్లను శరవేగంగా చైనా నిర్మించిందని, ఇది గతంలో భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతమని తెలిపాయి. ఈ నిర్మాణాలను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) పర్యవేక్షిస్తున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కామెంగ్‌ ఏరియాలో చైనా రెండు గ్రామాలను నిర్మించిందని తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్