Saturday, September 21, 2024
HomeTrending NewsYS Jagan: ఉన్నత విద్యలో సమూల మార్పులు : సిఎం జగన్

YS Jagan: ఉన్నత విద్యలో సమూల మార్పులు : సిఎం జగన్

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని మన విద్యావిధానంలో ఎలా వినియోగించుకోవాలనే  అంశంపై దృష్టి సారిస్తూనే,  రెండోవైపున  ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏఐ కరిక్యులమ్‌లో భాగం కావాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో  సిఎం జగన్  కీలక సమావేశం నిర్వహించారు.

” టెక్నాలజీ పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్‌ 1784లో స్టీమ్‌తో రైలు ఇంజన్‌ రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్‌ రూపంలో మరొక రివల్యూన్‌ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం.  ఇప్పుడు  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే… మనం ఈరంగాల్లో  నాయకులం అవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్‌ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారు.

గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్‌ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్‌ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో మనం క్రియేటర్లుగా తయారు కావాలి” అని నిర్దేశించారు.

అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలని,  దీనిపై ఎలాంటి విధానం అమలు చేస్తే మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి,  విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అనే దానిపై ఆలోచించాలని సూచించారు.

“శరీరాన్ని కోసి ఆపరేషన్‌ చేసే రోజులు పోయాయి. కేవలం కొన్ని హోల్స్‌ చేసి.. కంప్యూటర్ల ద్వారా  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడకుని ఆపరేషన్‌ చేసే స్థాయి వచ్చింది. అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి.  హర్యానాలోని ఒక మెడికల్‌ కాలేజీలో కూడా దీనికి సంబంధించిన కోర్సులనుకూడా పెట్టారు.  కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన జ్ఞానం ఇవ్వడమేకాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న దానిపై పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి” అంటూ వైస్ ఛాన్స్ లర్లను కోరారు.

“వ్యవసాయం చేసే తీరుకూడా గణనీయంగా మారిపోతోంది. మన రాష్ట్రంలో  గ్రామస్థాయిలో ఆర్బీకేలను తీసుకుని రావడం ద్వారా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. గణనీయ మార్పులు తీసుకు వచ్చాం. గ్రామ స్ధాయిలో చేయిపట్టుకునినడిపే వ్యవస్ధను తీసుకొచ్చాం. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రతి రైతును, ప్రతి ఎకరాలో సాగును కూడా చేయిపట్టుకుని నడిపించుకునే స్థాయికి వెళ్లాలి. ప్రతి ఎకరాలో భూసార పరీక్ష చేస్తాం. శాటిలైట్‌ ఇమేజ్‌ ద్వారా భూమిలో ఉన్న కాంపోజిషన్‌ చెప్పే పరిస్థితి ఉంది.  డ్రోన్లు ద్వారా భూసారం ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఈ రిపోర్ట్‌ ద్వారా ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకునిరావచ్చు. దీనిద్వారా ఆ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఇట్టే తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీని మనం పిల్లలకు నేర్పకపోతే.. మనం వెనకబడతాం” అని సిఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

” నా ఆలోచనలను తదుపరిస్థాయికి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో పలు విధానాలు ఇప్పటికే వచ్చేశాయి. కాని వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం. కంటెంట్‌ ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి అన్నదానిపై మనం ఆలోచన ఉండాలి. శిక్షణ ఇచ్చుకుంటూ పోతే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధం అవుతారు. ఆ రకంగా దీన్ని అధిగమించాలి. దీనిపై మరిన్ని ఆలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. మన కలను సాకారం చేసుకోవాలి” అని వైస్ ఛాన్స్ లర్లకు సిఎం మార్గనిర్దేశం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్