Farmers’ Death in UP & Aryan Khan’s Arrest: How Dailies Covered the News
ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకీయ పేజీ మిగతా పత్రికలతో పోలిస్తే వైవిధ్యంగా ఉంటుంది. భిన్నవాదనలకు వేదికగా ఉంటుంది.
ప్రధాని మోడీ అవతార పురుషుడు అని బి జె పి నాయకుడి సత్యకాలం ప్రింట్ అయిన చోటే మరుసటి రోజుల్లో వరుసగా యోగేంద్ర యాదవ్, రాజ్ దీప్ సర్దేశాయ్ దీపశిఖల్లో మోడీని తూర్పారబట్టే వ్యాసాలు వస్తుంటాయి. సంపాదకీయ పేజీని జనం చదివేలా సుదీర్ఘకాలంగా నిర్వహిస్తున్న జ్యోతిని ఈ విషయంలో అభినందించాలి.
ఒక వారం వెంట వెంట యోగేంద్ర యాదవ్, రాజ్దీప్ సర్దేశాయ్ సంపాదకీయ వ్యాసాలు వచ్చాయి. సహజంగా రెండూ అనువాదాలే. రచయిత ధ్వని దెబ్బ తినకుండా తెలుగు సహజత్వం కోల్పోకుండా అనువదిస్తున్నారు. ఇద్దరూ చాలాకాలంగా మోడీ వ్యతిరేక వాణిని వినిపిస్తున్నవారే. వీళ్లిద్దరు మీడియాకు సంబంధించి కొన్ని మౌలికమయిన ప్రశ్నలను లేవనెత్తారు.
అవి:-
1. ఉత్తర ప్రదేశ్ లో ఉద్యమ రైతుల మీదికి ఎక్కిన రెండు కార్లు బలితీసుకున్న ప్రాణాల కంటే…మెయిన్ స్ట్రీమ్ మీడియాకు షారుఖ్ ఖాన్ కొడుకు తేలే నౌకలో మాదకద్రవ్యాలతో పట్టుబడ్డ వార్త ఎలా ప్రధానమయ్యింది?
2. ఈ వార్తా ప్రాధాన్యం, సందర్భం కాకతాళీయంగా జరిగిందా? మీడియా మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా జరిగిందా?
3. నోరు లేని రైతులు వార్తా ప్రాధాన్యాల గురించి పెద్దగా పట్టించుకోరు అనుకుని మీడియాకూడా వారి ప్రాధాన్యాన్ని గాలికి వదిలేసిందా?
4. పి ఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి కాదు; కాబట్టి సమాచార హక్కు కింద ఎలాంటి వివరాలు చెప్పం…అని కేంద్రం ప్రకటించడాన్ని ప్రశ్నించే మీడియా ఉందా?
మిగతావి రాజకీయపరమైన అంశాలు. అవి ఇక్కడ అనవసరం.
లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో పైకప్పు(ఫాల్స్ సీలింగ్) మీద వర్ణ చిత్రాలుంటాయి. నాట్యమండపం పైకప్పు మీద ఒక్కో వరుసలో ఒక బొమ్మల కథ ఉంటుంది. అందులో ఒక పురాణగాథ నుండి తీసుకున్న విష్ణు వర్మ ధర్మ పాలన చిత్ర కథ ఉంది. విష్ణువర్మ అంతఃపురం ముందు ఒక ధర్మ గంట ఉంటుంది. ఎవరికయినా అన్యాయం జరిగి…తక్షణ విచారణ జరగాలనుకుంటే వచ్చి…కిందదాకా వేలాడుతున్న తాడుతో గంటను మోగిస్తే చాలు…విష్ణు వర్మ వెనువెంటనే న్యాయపరిషత్ ను సమావేశ పరిచి…విచారణలో వాదనలు విని…అప్పటికప్పుడే తీర్పు చెబుతూ బాధితులకు న్యాయం చేస్తూ ఉంటాడు. చాలా కాలం పాటు ఆ గంటను మోగించాల్సిన అవసరం ఎవరికీ రాలేదు.
ఒక రోజు ధర్మ గంట మోగింది. రాజు కోట గుమ్మం మీదికి వచ్చి ఎవరు మోగించారోనని చూస్తే…అక్కడ ఎవరూ లేరు. ఒక ఆవు ఉంది.
రాజు:-
ఎందుకు ధర్మ గంట మోగించావు?
ఆవు:-
నా గారాల లేగ దూడ మీద నీ కొడుకు కన్నుమిన్నుగానక వేగంగా రథం పోనిచ్చాడు. దూడ చచ్చి పోయింది. నాకు న్యాయం చేయగలరు.
రాజు:-
యువరాజయిన నా కొడుకును పిలిపించండి. ఒక ఎడ్ల బండి తీసుకురండి. చనిపోయిన దూడను బండి మీద పడుకోబెట్టండి. నా కొడుకును దూడ చనిపోయిన చోటే పడుకోబెట్టండి. అతడిమీద ఈ బండిని నడపండి. తల్లి ఆవు వెనుక నడిచి వస్తూ ఉంటుంది.
భటులు:-
చిత్తం మహారాజా.
పురప్రముఖులు, జనమంతా చూస్తుండగా విష్ణు వర్మ కొడుకు మీద బండి చక్రాలు వెళ్లాయి. ధర్మపాలనకు, సత్వర సమన్యాయానికి పొంగిపోయిన దేవతలు పుష్ప వృష్టి కురిపించారు. చనిపోయిన దూడను, విష్ణు వర్మ కొడుకును బతికించారు. ఆవు దూడతో హాయిగా వెళ్లింది. విష్ణు వర్మ కొడుకుతో అంతఃపురంలోకి వెళ్లిపోయాడు. కథ సుఖాంతం. మనం గర్భ గుడిలోకి వెళ్లిపోతాం.
గుడి సమాజానికి దారిచూపే బడి అన్న ఎరుక ఉన్నవారు కాబట్టి విజయనగరరాజులు ఇలాంటి ధర్మపాలన కథలు భావి తరాలకు అందాలని ఇలా పైకప్పు చిత్రాల్లో చిత్రించారు.
ధర్మపాలనలో విష్ణు వర్మ ఆదర్శాన్ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో రైతుల మీద వెళ్లిన ఎస్ యు వి ఆధునిక రథాలకు, మంత్రిగారి పుత్ర రత్నానికి, మసిపూసిన మారేడుకాయలకు, సాక్ష్యాల తారుమారుకు, అబద్దాల అల్లికలకు అన్వయించుకోండి. ఇప్పుడు ధర్మ దేవత ఎన్ని కాళ్లమీద నడుస్తోందో? ఒక కాలయినా ఉందో? లేదో? ఎవరికి వారికి అర్థమైపోతుంది.
ప్రభుత్వం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు…మీడియాలో దానికి విపరీతమయిన ప్రాధాన్యం దక్కి…డ్యామేజ్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు…ఈ సమస్యను వదిలి మీడియా వెంటపడడానికి మరో సమస్యను సృష్టించడం…మీడియా మేనేజ్మెంట్ లో ఒక భాగం.
రాముడేలిన రాజ్యంలో విష్ణువర్మల ధర్మపాలన ఉన్నప్పుడే…రావణాసురుల రాక్షసపాలన కూడా ఉండేది. పాలను- నీళ్లను వేరు చేసుకునే హంసలే అంతరించిపోయాయి!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read:
Also Read: