Jangareddygudem row: జంగారెడ్డి గూడెంలో నాటు సారా తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ మరణాలు సంభవించాయని, ఈ సంఘటనను సిఎం జగన్ తేలికగా తీసుకోవడం, మౌనం వహించడం, నిజ నిర్ధారణ చేయించకపోవడం దారుణమని అయన వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
నాటు, కల్తీ సారా వల్ల ఎవరూ చనిపోలేదని, అవన్నీ సహజ మరణాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, దేవాలయం లాంటి శాసనసభలో చెప్పడం హాస్యాస్పదమని, ఇలాంటి సిఎం ఉండడం దౌర్భాగ్యమని అన్నారు. సాధారణంగా ఇలాంటి మరణాలపై విచారణ జరిపించడం ప్రభుత్వ కనీస ధర్మమని, ఈ సిఎం అదికూడా చేయించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో అక్రమ మద్యం, నాసిరకం బ్రాండ్లు తీసుకు వస్తున్నారని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచారని.. ఈ మద్యం తాగలేక ప్రజలు నాటు సారాకు అలవాటు పడ్డారని అచ్చెన్న వివరించారు. గూడెంలో 27మంది చనిపోయారని తాము సభలో చెప్పినా ఈ అంశంపై చర్చకు తావివ్వకుండా, ఎక్సైజ్ మంత్రితో సమాధానం చెప్పించకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడించారని అచ్చెన్న విస్మయం వ్యక్తం చేశారు.
ఏదేని అంశంపై ప్రకటన చేయాలంటే ఆ కాపీని ముందుగా సభ్యులకు పంచి ఆ తర్వాత మంత్రి సభకు వివరిస్తారని… కానీ ఈ సంప్రదాయాన్ని కూప్డా పాటించలేదని మండిపడ్డారు. ప్రశ్నించిన తమని సభనుంచి సస్పెండ్ చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దుర్ఘటనపై స్పందించి మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : నేడు కూడా టిడిపి సభ్యుల సస్పెన్షన్