రీసెంటుగా నెట్ ఫ్లిక్స్ లోకి ‘గన్స్ అండ్ గులాబ్స్’ అందుబాటులోకి వచ్చింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ మొదటి నుంచి చివరి వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సిరీస్ లో చాలానే పాత్రలు ఉన్నప్పటికీ, రాజ్ కుమార్ రావు .. దుల్కర్ సల్మాన్ .. గుల్షన్ దేవయ్య ప్రధానమైన పాత్రలలో కనిపిస్తారు. ఎవరి పాత్రలో వారు బాగా చేశారు. మూడు ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా అనిపిస్తుంది. రాజ్ కుమార్ రావు పాత్ర కామెడీ టచ్ తో నడిస్తే, దుల్కర్ రోల్ సీరియస్ గా కొనసాగుతుంది.
ఇక గుల్షన్ దేవయ్య పాత్ర మరింత డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ సిరీస్ లో ఆయన పాత్ర పేరు ఆత్మారామ్ .. కిరాయి హంతకుడిగా కనిపిస్తాడు. ఫలానా వ్యక్తిని చంపమని డబ్బులు ఇస్తే, ఆ పని పూర్తయ్యేవరకూ అదే పనిగా తిరిగే పాత్ర ఇది. శత్రువును చంపడానికి ఎలాంటి గన్స్ వాడకుండా కేవలం ‘బటన్ నైఫ్’ తో గొంతు కోసేయడం ఆయన ప్రత్యేకత. శత్రువును చంపడంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. దానిని ఆయన పక్కాగా ఫాలో అవుతూ ఉంటాడు. ఒక హత్యకి 4 సార్లకు మించి ఆయన కత్తిని ఉపయోగించడు.
ఇక ఆత్మారామ్ ఎక్కువగా మాట్లాడడు .. ఎక్కువగా ఎవరైనా మాట్లాడితే ఆయనకి నచ్చదు. ఈ కథ 90ల కాలంలో నడుస్తుంది. అందువలన ఆయన ‘కాయిన్ బాక్స్’ నుంచే కాల్ చేస్తూ ఉంటాడు. అవతల వారు ఎంత గొప్పవాళ్లు అయినా వన్ రూపీ కాయిన్ వరకే తనకి విషయం చెప్పాలి. మరో కాయిన్ వేసే అలవాటు ఆయనకి లేదు. హత్య చేసేటప్పుడు పాప్యులర్ హిందీ హిట్ సాంగ్స్ ను వింటూ చేయడం ఆయనకి అలవాటు. గట్టిగా మాట్లాడి తనని ఇరిటేట్ చేశాడనే కోపంతో, తనకి ఆపరేషన్ ను అప్పగించిన వ్యక్తినే చంపేసే పాత్ర. ఇలా డిఫరెంట్ గా నడిచే ఈ పాత్ర ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్టు అవుతుంది.