జాతుల మధ్య వైరంతో చిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సూడాన్ లో ప్రజలకు అండగా నిలవాల్సిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు లైంగిక హింసకు పాల్పడుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థి శిభిరంగా పేరున్న దార్ఫూర్ లో సాయం కోసం వెళుతున్న మహిళలు, యువతులను లైంగికవాంచ తీర్చమని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. తిండి పదార్థాల కోసం వెళుతున్న బాలికలపై సైతం యుఎన్ బలగాలు ఆఘాయిత్యానికి ఒడిగడుతున్నాయని విమర్శలున్నాయి.
యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆహారం కోసం బలవంతంగా సైనికులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తున్నట్టు ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది. తమ కుటుంబాల పోషణ కోసం ఆహారం, సరుకులు పొందాలంటే సైనికుల కామవాంఛ తీర్చడం మినహా మరో మార్గం లేని దుస్థితి నెలకొంది. ఒండుర్మన్ నగరం నుంచి పారిపోయి వచ్చిన రెండు డజన్ల మందికిపైగా మహిళలు తమ దీనస్థితిని గార్డియన్ ప్రతినిధులకు వివరించారు.
ఒండుర్మన్ నగరంలో ఆహార నిల్వలున్న దాదాపు అన్ని గోదాముల వద్ద ఈ దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ‘ఎంతో వృద్ధులైన నా తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆహార సేకరణ కోసం నా కుమార్తెను ఎన్నడూ బయటికి పంపలేదు. అందుకు బదులుగా నేనే సైనికుల వద్దకు వెళ్లా. ఆహారాన్ని పొందేందుకు ఇంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది’ అంటూ ఓ మాంసం శుద్ధి కర్మాగారం వద్ద బలవంతంగా సైనికులతో శృంగారంలో పాల్గొన్న మహిళ కన్నీటిపర్యంతమైనట్టు ‘గార్డియన్’ వివరించింది.
2007, 08 సమయంలో కూడా యుఎన్ బలగాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక గుడ్డు కోసం వెళ్ళిన మహిళను బలగాలు చెరిచాయి. గుడ్డు, చాక్లెట్, బిస్కట్ల ఆశ చూపి నిరుపేద మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. కన్నబిడ్డల ఆకలిని తీర్చేందుకు అనేకమంది మాతృమూర్తులు యుఎన్ బలగాల్లో కీచకుల కామవాంచకు తలొగ్గారు.
శాంతి బలగాల్లో UNలోని అన్ని దేశాలకు చెందిన సైనికులు ఉన్నారు. అప్పట్లో జరిగిన ఈ ఘోరాలలో పాకిస్తాన్, నేపాల్ సహా భారత సైనికులు కూడా ఉన్నారని అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొన్నది. ఇజ్రాయల్-హమాస్ యుద్ధం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై విచారణలు జరిపే అంతర్జాతీయ న్యాయస్థానం సుడాన్ లో జరుగుతున్న ఘోరాలపై స్పందించటం లేదు.
డార్ఫర్‌లో హింస చారిత్రాత్మకంగా (ముస్లిం-నాన్ ముస్లిం) అరబ్ జాతీయులు ఇతర గిరిజన తెగల మధ్య భూమి,నీటి వివాదాలతో మొదలై నేటికి రావణ కాష్టం మాదిరి రగులుతోంది. జాతుల వైరంతో ఎల్ జెనీనా, వెస్ట్ డార్ఫర్ పరిసర ప్రాంతాల నుంచి ఐదు లక్షల పైచిలుకు ప్రజలు… ఎక్కువగా మస్సాలిట్, పొరుగున ఉన్న చాద్‌లోకి కట్టుబట్టలతో పారిపోయారు.
లైంగిక హింస యుద్ధంలో ఒక ఆయుధంగా మారింది. సూడాన్ లో శాంతి పరిరక్షక దళాల్లో ఉన్న కీచకులపై చర్యలు తీసుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తో పాటు ఇతర స్వచ్చంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
-దేశవేని భాస్కర్