Tuesday, September 17, 2024
HomeTrending Newsహిందువులపై అకృత్యాలు... బంగ్లాదేశ్ ప్రభుత్వం మొసలి కన్నీరు

హిందువులపై అకృత్యాలు… బంగ్లాదేశ్ ప్రభుత్వం మొసలి కన్నీరు

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతను ఆసరా చేసికొని మతోన్మాదులు దారుణాలకు ఒడిగడుతున్నారు. రిజర్వేషన్ల నిరసనల పేరుతో మొదలైన హింసాకాండ దేశంలో మైనారిటీలపై ఆకృత్యాలకు దారితీస్తున్నాయి. మైనారిటీలైన హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై భొతిక దాడులు యధేచ్చగా సాగుతున్నాయి. మత మార్పిడి పేరుతో హిందూ స్త్రీలపై అత్యాచారాలు జరుగుతుంటే… మానవత్వం మరిచిన మెజారిటి మతం స్త్రీలు సహకరించటం సిగ్గుచేటు. చచ్చుబడిన పాలనాయంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఇస్కాన్ ఆలయాలను ద్వంసం చేసి.. హిందు వ్యాపారుల ఆస్తులను లూటీ చేస్తున్నారు.

ఇంత జరుగుతుంటే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మతోన్మాదులను కట్టడి చేయకపోగా మైనారిటీలను క్షమాపణ కోరుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. చర్చిలు, దేవాలయాలపై అల్లరిమూకలు దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నాయి. దాడులకు నిరసనగా ఆదివారం వేలాది మంది మైనారిటీలు ఢాకా వీధుల్లో ఆందోళనకు దిగారు. మైనారిటీలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. భద్రత కల్పించడంలో విఫలమైనందుకు తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్‌ జనరల్‌ సఖావత్‌ హుస్సేన్‌ హిందూ సమాజాన్ని క్షమాపణలు కోరారు.

బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు చూస్తుంటే దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో జరిగిన దారుణాలు గుర్తుకు వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  లాహోర్, కరాచీ నగరాల్లో శ్రేమంతులైన హిందువులు, పంజాబీల ఆస్తులు కబ్జా చేయటం, హిందూ యువతుల్ని కిడ్నాప్ చేసి బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కన్న కూతురు జాడ తెలియక ప్రాణాలు విడిచిన తల్లిదండ్రులు ఎందరో లెక్కలేదు.  కుటుంబ సభ్యుల ముందే స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడు అదే రీతిలో బంగ్లాదేశ్ లో  చోటు చేసుకుంటున్నాయి.

బంగ్లాదేశ్ మానవ హక్కుల సంస్థ ఐన్ ఓ సలీష్ కేంద్రం 2013 నుండి 2021 వరకు హిందువులపై 3,679 దాడులను నమోదు చేసింది. 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 వరకు దాడులు జరిగినట్లు పలు హిందూ సంస్థలు పేర్కొన్నాయి.

వీటి వెనుక జమాతే ఇస్లామి చాందసవాదులు ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాలస్తీనాలో ఇజ్రాయల్ దాడులు అని రోజు పతాక శీర్షికలలో వార్తలు అందించే భారత మీడియాకు బంగ్లాదేశ్ లో దారుణాలు కనిపించటం లేదు. పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు తెలిపే భారత దేశ పార్టీలను బంగ్లాదేశ్ లో మైనారిటీల కన్నీటి గాథలు కదిలించటం లేదు. రోహింగ్యాలకు మద్దతుగా గొంతెత్తిన నేతలకు, సంస్థలకు నోళ్ళు మూతపడ్డాయి.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పష్టం చేశారు. గత కొన్ని వారాలుగా సాగుతున్న హింస ఆందోళనకరమన్నారు.

బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణకాండకు నిరసనగా అమెరికా, నేపాల్ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నా భారత్ లో రాజకీయ పార్టీలు మొక్కుబడి ఖండనలతో వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి.. రాజకీయ పార్టీలు కలసి కట్టుగా బంగ్లాదేశ్ లో మైనారిటీల రక్షణకు  నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్