RRR-Alia Bhatt: రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్‘ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ .. చరణ్ తమ పాత్రల్లో చెలరేగిపోయారు. యాక్షన్ .. ఎమోషన్ .. డాన్సులు .. ఫైట్లు .. ఇలా ఒకటేమిటి అన్నిరకాలుగా నువ్వా? నేనా? అన్నట్టుగా తెరపై పోటీపడ్డారు. ఇద్దరిలో ఎవరి పాత్ర ఎక్కడా తగ్గకుండా రాజమౌళి సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు పాత్రలను అంచలంచెలుగా పైకి లేపుతూ వెళ్లారు.
అంతా బాగానే ఉంది .. కానీ కథానాయికల విషయంలోనే అభిమానుల్లో అసంత్రిప్తి పెరుగుతోంది. ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం ఢిల్లీలో అడుగుపెడతాడు. ఆయనకి ఒలీవియాతో పరిచయం ఏర్పడినప్పటికీ అది ప్రేమగా ఆయన అనుకోలేదు. తెలుగులో పాట ఊహించి కోవడానికి ఆమెకి తెలుగు రాదు. అందువలన ఈ జంట మధ్య పాట కష్టమే. తనకి హీరోయిన్ ఉన్నట్టా .. లేనట్టా .. ఉండీలేనట్టా? అని ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ నవ్వుతూ అన్నది ఇందుకోసమే.
అందువలన చరణ్ – అలియా మధ్య సాంగ్ ఉంటుందని అంతా అనుకున్నారు. ‘వస్తాడు .. నా రాజు ఈ రోజు’ వంటి ఒక పాట వెన్నెల్లో వెచ్చగా వేసుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకో అలాంటి పాట తెరపైకి రాలేదు. పైగా ‘సీత’ పాత్రలోని తెలుగుదనం అలియాలో కనిపించలేదు. ఆ పాత్రకి ఆమె సెట్ కాలేదనే అనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే, సన్నివేశాల పరంగా కూడా నిడివి చాలా తక్కువ. ఇలాంటి ఒక చిన్న పాత్ర కోసం అలియాను తీసుకొచ్చారా ? ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారా? అని ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది.