Saturday, January 18, 2025
Homeసినిమాఉత్కంఠ పెంచుతున్న 'భారతీయుడు 2'

ఉత్కంఠ పెంచుతున్న ‘భారతీయుడు 2’

కమలహాసన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాల జాబితా ఆయన చేసిన ప్రయోగాలకు .. సాహసాలకు అద్దం పడుతూ ఉంటుంది. శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘భారతీయుడు’ 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేసింది. తండ్రి కొడుకులుగా కమల్ ద్విపాత్రాభినయం … భారతీయుడిగా తండ్రి లుక్ .. మనీషా కొయిరాలా గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి.

ఇక శంకర్ రాసుకున్న కథాకథనాలు ఒక ఎత్తయితే, రెహ్మాన్ అందించిన నేపథ్య సంగీతం .. అల్లుకున్న బాణీలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. అలా ఈ సినిమా మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. ఆ తరువాత చాలా కాలం పాటు ఈ సినిమా టీవీలలో ఎన్ని సార్లు ప్రసారం చేసినా మంచి రేటింగును నమోదు చేస్తూ వచ్చింది. అంతగా ప్రభావం చూపిన ఆ సినిమాకి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ రూపొందింది. కొన్ని కారణాలుగా నిర్మాణం దశలో అవాంతరాలను ఎదుర్కుంటూ వచ్చిన ఈ సినిమా, రేపు భారీ స్థాయిలో విడుదలవుతోంది.

మొదటి పార్టు అంతా అవినీతి – లంచగొండితనంపై నడుస్తుంది. ఇక ఈ సారి శంకర్ వాటిని ఏ కోణంలో చూపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇంతకుముందు ‘విక్రమ్’ సినిమాకి అతను ఏ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడనేది తెలిసిందే. అందువల్లనే ‘భారతీయుడు 2’కి అతణ్ణి ఎంచుకున్నారు. ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారు. మరి గతంలో వచ్చిన ‘భారతీయుడు’కి మించి ఈ సీక్వెల్ ఉంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్