Travis Head fast century:
యాషెస్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లకు 343 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో ట్రావిస్ హెడ్ కేవలం 85 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. హెడ్ కిది టెస్టుల్లో మూడో సెంచరీ కాగా, యాషెస్ లో మొదటిది. డేవిడ్ వార్నర్-94, మార్నస్ లాబుస్ చేంజ్-74 పరుగులతో రాణించారు. నిన్న ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పూర్తి కాగానే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీనితో ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు.
నేటి ఉదయం పిచ్ పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ కొనసాగించేందుకు ఒకే చెప్పారు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది, మార్కస్ హారిస్ కేవలం మూడు పరుగులే చేసి రాబిన్ సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రెండో వికెట్ కు డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్ చేంజ్ 156 పరుగులు జోడించారు. మార్నస్ లాబుస్ చేంజ్ 74 పరుగులు చేసి ఔట్ కాగా, వార్నర్ 94 పరుగుల వద్ద పెవిలియన్ చేరి సెంచరీ చేజార్చుకున్నాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 112, మిచెల్ స్టార్క్-10 పరుగులతోను క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 196 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ మూడు వికెట్లు సాధించగా, ఓక్స్, మార్క్ వుడ్, జాక్ లీచ్, జో రూట్ తలా ఒక వికెట్ పడగొట్టారు. నేడు 98 ఓవర్లపాటు ఆడాలని లక్ష్యం నిర్దేశించుకోగా 84 ఓవర్లపాటు మాత్రమే ఆట కొనసాగింది.
Also Read : యాషెస్ తొలిటెస్ట్: ఇంగ్లాండ్ 147 ఆలౌట్