Wednesday, March 18, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవాడుక మాటల్లో అడుగడుగునా చావే

వాడుక మాటల్లో అడుగడుగునా చావే

“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి”

పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు.

భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఫేమస్. చావు పందిట్లో సౌండ్ బాక్స్ లో ఘంటసాల పాడిన భగవద్గీతను మొదట ఎవరు వాడారోకానీ, ఆ క్షణం నుండి భగవద్గీత ఆత్మలకు, అంతరాత్మలకు, దశదిన కర్మలకు, శవ యాత్రలకు, సంతాప సభకు, సామూహిక శోక సభలకు మాత్రమే పరిమితమైపోయింది. అర్జున విషాదయోగం అని ఒక అధ్యాయానికి పేరు ఉండడంతో భగవద్గీత విషాదానికి సంకేతంగా మరికొందరు భావించారు. నిజానికి మొత్తం భగవద్గీత కర్తవ్య బోధ. పనులు చేయకుండా తప్పించుకునే పలాయనవాదులకు కర్రుకాల్చి భగవంతుడు పెట్టిన వాత. ఎనభై ఏళ్లు దాటి కాటికి కాళ్లు చాచినవారికి తప్ప మిగతావారికి భగవద్గీత అంటరానిది కావడానికి రకరకాల కారణాలు. ఆ చర్చకు ఇది వేదిక కాదు.

Painless Death

అనాయాసేన మరణం;
వినా దైన్యేన జీవనం – అని సుఖమయిన చావు కోసం , ఒకరు జాలిపడేలా జీవితం ఉండకుండా ఉండడం కోసమే గుడికి వెళ్లినప్పుడు భగవంతుడిని ప్రార్థించాలని ఒక ప్రమాణం . ఇలా అడగడానికి మొదట ధైర్యం కావాలి ; తరువాత అమాయకత్వమో, అజ్ఞానమో ఉండాలి.

చావంటే భయం నటిస్తాం కానీ…నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం. కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది. నిజానికి చచ్చేప్పుడు ఎవరూ పని పెట్టుకోరు – చచ్చే పని తప్ప. ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా చచ్చే చావొస్తుంది. పసిపిల్లలు అల్లరి చేస్తుంటే చంపేస్తున్నార్రా అనకపోతే బతుకు సాగదు . చచ్చేట్టు తిడితేనే తిట్టినట్లు. కొందరు పెళ్ళిలో, చావులో మాత్రమే కలుస్తూ ఉంటారు. శుభమా అని సుబ్బి పెళ్లి పీటలు ఎక్కితే ఆమె చావుకే వస్తుంది. కొడితే చచ్చేట్టు కొట్టాలి. చావు కబురు ఎప్పుడూ చల్లగానే చెప్పాలి.

పెళ్ళికి చావుకు ఒకే మంత్రం ఎక్కడ చెబుతారోనని ఆందోళన. రాచపీనుగ ఒంటరిగా వెళ్లలేక తోడుకోరుకున్నా మనం అర్థం చేసుకోగలం. కోపమొస్తే చచ్చినా ఇక పగవాడి మొహం చూడం. పైగా వారికే చచ్చినా నీ గడప తొక్కను అని బతికితికున్న గర్వంతో చెప్పగలం. చాలామంది మనల్ను రోజూ చంపుకు తింటున్నా ఎలాగో మళ్లీ మళ్లీ బతుకుతూ ఉంటాం. బాగా కోపమొస్తే బతికి ఉన్న వారిని ఒరేయ్ పీనుగా! అంటూ చంపేస్తాం. ఒట్టి పీనుగకు విలువ లేదనుకుంటే చవట పీనుగ, ముదనష్టపు పీనుగ అని విశేషణాలు జతచేస్తాం. జాగారంలో శవజాగారం ఒకటి. పీనుగ ఎదురొస్తే అదృష్టమే అదృష్టమట.

ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ చావు పాండిత్యం ఎందుకు?
ప్రాణం ఉంటే శివం – ప్రాణం లేకుంటే శవం.
మృతియె లేకున్న రుచి ఏది ఇలలోన? అన్నాడు దాశరథి .
స్వతంత్ర దేశంలో చావును పెళ్లిగా మలిచారు సినీ కవులు.

మరణాంతాని వైరాని – చచ్చాక పగలు ప్రతీకారాలు కూడా చచ్చి పోవాలి అని హితవు చెప్పాడు శ్రీరామచంద్రుడు.
సమయం ఆసన్నమయినప్పుడు పండిన దోసకాయ తీగనుండి టక్కుమని తనకు తానుగా విడివడినట్టు బంధాలను తెంచుకుని మృత్యువులోకి వెళ్లాలంటుంది మృత్యుంజయ మంత్రం. చాలామంది చావును జయించడానికే ఈ మంత్రం అనుకుని చచ్చేట్టుగా చదువుతుంటారు. నిజానికి ఇది చావు భయాన్ని జయించే మంత్రం.

యముడు కలలో కూడా నిషిద్ధం. చావులేని జగతిని ఒక్క సారి ఊహించుకోండి. దుర్భరంగా ఉంటుంది. అసలు ఈ లోకం పేరే మర్త్య లోకం . వ్యాకరణం, అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం. మృత్యువును వెంటబెట్టుకుని పుట్టే లోకాన్ని మర్త్య లోకం అంటారు.

అంతములేని ఈ భువనమంతయు – అంటూ ఎంతటివారయినా ఈ భూమి మీద పోవాల్సిందే అన్నాడు దువ్వూరి రామిరెడ్డి . భూమి ఒక బాట. పొద్దున, సాయంత్రం ఈ బాటకు అటు ఇటు తలుపులు. ఆ తలుపులో వచ్చి , ఈ తలుపుగుండా వెళ్లిపోవాల్సిన వాళ్లమే.

Painless Death

మరణానికి భయపడకుండా మరణాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడారు సి నా రె.
మరణం నా చివరి చరణం కాదన్నాడు అలిశెట్టి ప్రభాకర్.

“మృత్యువుకు నేనంటే భయం. నేనున్నప్పుడు అది నాముందుకు రాదు.
అది వచ్చినప్పుడు నేను ఉండనే ఉండను”- అని ఒక ధైర్యవంతుడు కొంటెగా అన్నా మృత్యువుకు లొంగిపోయేవాడినే అని చెప్పకనే చెప్పుకున్నాడు.

వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు అయినా ఉండవచ్చు.
కానీ చావు ఎగతాళి కాదు.
చావు- చచ్చేంత సీరియస్.

చచ్చేప్పుడు నొప్పి తెలియకుండా, హాయిగా చనిపోవడానికి ఆస్ట్రేలియాలో ఆధునిక యంత్రాన్ని కనుక్కున్నారు. అయితే చావుకు ఎవరూ ముహూర్తం పెట్టుకోరు. అలా పెట్టుకున్నారంటే అది ఆత్మహత్య. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఆత్మహత్యా యత్నం హత్యా యత్నంతో సమానమయిన నేరమే. మనలాగే మిగతా దేశాల్లో కూడా ఆత్మహత్య నేరం. చేయకూడని పాపం.

Painless Death

హత్యలు, ఆత్మహత్యలు నేరాలే. కానీ…ఆగట్లేదు కదా? రకరకాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి చివరి క్షణాలు హాయిగా, ప్రశాంతంగా గడవడానికి తమ ఆధునిక ఆత్మహత్యా యంత్రం అద్భుతంగా పనికివస్తుందని దీని తయారీదారులు చావు కబురు చల్లగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఒక గ్లాస్ క్యాప్సూల్ లా ఉండే ఈ చేంబర్లోకి కూర్చుని…పైన గ్లాస్ డోర్ బిగించుకుని…స్విచ్ ఆన్ చేసుకుంటే చాలట… హాయిగా చస్తారట.

ఉరితాడు, సీలింగ్ ఫ్యాన్, విషం, రైలు పట్టాలు, బావులు ఓల్డ్ ఫ్యాషన్. గ్లాస్ క్యాప్సూల్ లేటెస్ట్ ఫ్యాషన్.

ఆత్మహత్య కూడా టెక్నీకల్ గా బాగా అప్ డేట్ అయ్యింది.
విష్ యూ ప్లెజెంట్ సూసైడ్! అని విషెస్ కూడా చెప్తారో ఏం పాడో!

ఇలాంటి ఆత్మహత్యా యంత్రాలు, పరికరాలు, ఈ ప్రక్రియలను న్యాయవ్యవస్థలు అంగీకరించవు. కొన్ని దేశాల్లో ఐచ్చిక మరణాన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే అనుమతిస్తారు.

మనిషి మనుగడలో అడుగడుగునా యంత్రమే. చివరికి…
మరణాన్ని ఎంజాయ్ చేస్తూ చావడానికి మా కరెంటు పెట్టెనే వాడండి…
మన్నికకు మన్నిక…
సుఖమయిన చావు గ్యారెంటీ…
అని రేప్పొద్దున ప్రకటనలు కూడా రావచ్చు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

బలవుతున్న బాల్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular