Aussies won series: శ్రీలంకతో జరుగుతున్న టి 20 సిరీస్ ను ఆతిథ్య ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన ఆసీస్ నేడు జరిగిన మూడో మ్యాచ్ లో కూడా 6 వికెట్లతో గెలుపొందింది. లంక విసిరిన 122 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది.
కాన్ బెర్రా లోని మానుక ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కేన్ రిచర్డ్సన్ రెండు వికెట్లు తీసి లంకను దెబ్బ తీశాడు. ఆ తర్వాత కూడా త్వరగా వికెట్లు కోల్పోయిన లంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ దాసున్ శనక- 39 నాటౌట్; వికెట్ కీపర్ చండీమల్- 25 మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ మూడు; హాజేల్ వుడ్, మాక్స్ వెల్, అగర్ తలా ఒక వికెట్ సాధించారు.
ఆసీస్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ బెన్ మెక్ డెర్మోట్ వికెట్ కోల్పోయింది. తర్వాత మరో ఓపెనర్ అగర్ ఆస్టన్ (13) కూడా త్వరగా ఔటయ్యాడు. కెప్టెన్ పించ్(35), మాక్స్ వెల్ (39, 26 బంతులు; 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. చివర్లో జోష్ ఇంగ్లిష్-21; మార్కస్ స్టోనిష్-12 పరుగులతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ మూడు, వాండర్సే ఒక వికెట్ పడగొట్టారు.
కేన్ రిచర్డ్సన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది. ఐదు టి20 ల సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0తో ఆధిక్యంతో ఉంది.