నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి జాతి సంపదను అమ్మేయడం దారుణమని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గాజువాక కాకతీయ గేట్ నుంచి పాత గాజువాక వరకూ జరిగిన మహా పాదయాత్రను అవంతి ప్రారంభించారు. గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పెద్దఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నాయి
ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన అవంతి ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. నష్టాలు అనేది కేవలం ఓ సాకు మాత్రమేనని, వారు ఎందుకు పూర్తిగా వాటాలు విక్రయించాలని నిర్ణయించారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన అవంతి, కేంద్ర ప్రభుత్వ చర్యను అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. కార్మికులు చేస్తున్నది న్యాయపరమైన పోరాటమని, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక ముందే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అవంతి సూచించారు.