Avanthi review:
విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో గోవులు మృత్యువాత పడటంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వెంకోజీపాలెంలో ఉన్న ఆశ్రమాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోవులను పూజిస్తూ వాటిని మన జాతి సంపదగా భావిస్తామని అలాంటి గోమాతలు ఇలా మృత్యువాత పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్, పశుసంవర్ధక శాఖఉ సమన్వయంతో పని చేసి గోవులను సంరక్షించాలని ఆదేశించారు. ఆశ్రమ నిర్వాహకులు కూడా దాతలను ప్రోత్సహించి ఆవులకు ఆహారం అందేలా చూడాలని అన్నారు.
గోవులకు వైద్య పరీక్షలు చేయించాలని, వాటి పరిరక్షణకై సిబ్బంది కొరత లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అత్యవసరంగా నీరు, గడ్డి, దాణా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తనవంతు సహాయంగా దాణా నిమిత్తం మంత్రి 10 వేల రూపాయలు అందజేశారు. మంత్రితోపాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, మిలినియం శ్రీధర్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ వైసీపీ సీనియర్లనాయకులు అక్కరమాని వెంకట్రావు, వార్డు కార్పొరేటర్ అప్పిరి శ్రీవిద్య, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి తదితరులు ఆశ్రమాన్ని సందర్శించారు.
Also Read : విశాఖలో పలు ప్రాజెక్టుల ప్రారంభం