తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు గ్రామాలతో కలిపి ఓ ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం బాగుపడడానికి ఇక్కడి ప్రజలంతా త్యాగం చేశారని వారికోసం అవసరమైతే పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీ లో కాంటూరు లెవల్ తగ్గించి సిఎం జగన్ సరికొత్త కుట్రకు తెరతీశారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పోలవరం వచ్చి తీరుతుందని, పునరావాస ప్యాకేజీతో పాటు ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని సలహా ఇచ్చారు. ఇటీవలి వరదల బారిన పడిన పోలవరం విలీన గ్రామాల్లో బాధితులను పరామర్శించిన బాబు వారినుద్దేశించి మాట్లాడారు. రాజకీయంగా కష్టాల్లో ఉన్నప్పుడు పదవి కోసం పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వారిని గోదావరిలో ముంచారని విమర్శించారు.
వరద బాధితులను ఆడుకోవాల్సిన ప్రభుత్వం వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయిందని మండిపడ్డారు. రెండు వేల రూపాయలు సాయం చేసి చేతులు దులుపుకున్నారని, ఈ రెండు వేలతో వారి కష్టాలన్నీ తొలగి పోతాయా అని ప్రశ్నించారు. పోలవరంపై జగన్ చేతులెత్తేశారని, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం చెబుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని బాబు నిలదీశారు.