పొత్తుల కోసం బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు ఎంతగా ప్రాధేయపడ్డారో ప్రజలంతా గమనించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వాళ్ళ కాళ్ల దగ్గరకు వెళ్లి ‘మీరేం చెబుతారో చెప్పండి.. మా తలుపులన్నీ తెరిచే ఉన్నా’యంటూ వెంపర్లాడారని విమర్శించారు. “తెలుగుదేశం పార్టీ, మరో సెలబ్రిటీ పార్టీ నేతల పొత్తుల ఆరాటం.. ఢిల్లీ చుట్టూ వెంపర్లాడటం అందరం చూస్తూనే ఉన్నాం. పొత్తులు చేసుకోవడం.. పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్యంలో సహజమే గానీ.. ఈ రకమైన వెంపర్లాటతో కాళ్ల బేరాలకు దిగజారిన వాతావరణాన్ని మాత్రం ప్రజలు మొట్టమొదటగా చూస్తున్నారు. వీళ్లేమైనా కొత్త పార్టీ నేతలా అంటే కాదు. ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకుని.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని చంద్రబాబు .. రాష్ట్రంలోని ఆ గుమ్మం ఈ గుమ్మం తొక్కుకుంటూ చివరికి ఢిల్లీ గుమ్మంలో పొత్తుకు పడిగాపులు పడటం అనేది రాష్ట్ర ప్రజానీకానికి అత్యంత బాధాకరంగా ఉంది. చంద్రబాబు తీరును అసహ్యించుకుంటూ.. చాలా సిగ్గుచేటుగా చర్చించుకుంటున్నారు” అని పేర్కొన్నారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడారు.
మరోవైపు సిఎం జగన్ మాత్రం నాలుగేళ్ల పది నెలల కాలంలో మీ అందరి దయతో.. మీ అందరి మద్దతుతో… మీ ఆశీస్సులతో పరిపాలన చేశానని.. ఇన్నాళ్ల నా పాలనలో మీ కుటుంబానికి మేలు జరిగిందని అనుకుంటే ..మీరు మళ్లీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని గుర్తు చేశారు. తనకు తెలిసి రాజకీయాల్లో ఏ నాయకుడూ ఎన్నికల్లో ఈ విధంగా అడగలేదని, ఏదో మాయ మాటలతో మడమతిప్పి ప్రజల్ని మభ్య పెట్టిన నాయకుల్నే చూశాం గానీ.. జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నిజాయితీ గల మాట చెప్పి.. ఓటు అడిగే నాయకుడ్ని ఇప్పుడే చూస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన అంశాలెన్నో ఉన్నాయని, అధికారంలో ఉన్నప్పుడూ వాటి గురించి చంద్రబాబు ఆలోచించలేదని…. ఇప్పుడు అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడూ కూడా వాటి గురించి ఆలోచన చేయడంలేదుని బొత్స దుయ్యబట్టారు. “ప్రత్యేకహోదా, పోలవరంతో పాటు ప్రధానంగా విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి బీజేపీతో ఏం మాట తీసుకున్నారు..? రేపోమాపో పొత్తులు పెట్టుకున్న పార్టీల పెద్దలంతా రాష్ట్రానికి వస్తారు కదా..? మరి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ గురించి ఏం చెబుతారో చెప్పమనండి..? రాష్ట్ర ప్రజలకు, విశాఖ వాసులకు స్టీల్‌ప్లాంట్‌పై ఏమని చెబుతారో .. మేమూ చూస్తాం’ అంటూ చంద్రబాబునుద్దేశించి నిలదీశారు.