తనపై హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసు పెట్టారని, ఇదెక్కడి దుర్మార్గమో అర్ధం కావడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. ఎన్ ఎస్ జి కమెండోలు, మీడియా, ప్రజల సాక్షిగా తనపై హత్యాయత్నం జరిగిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని… అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటన ను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తనపై నమోదైన కేసుపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామన్నారు.
ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు చేస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. నేను పుంగనూరుకు వెళ్లలేదని, హంద్రీనీవా వద్దకు వెళుతున్నానని, మా కార్యక్రమానికి మేం వెళుతుంటే వేలాది మంది వైసీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ‘ మా అందరినీ చంపి మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా’ అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిస్సహాయులను చేయడమే కాకుండా వారిని కూడా అధికార పార్టీ నేరాల్లో భాగస్వాములను చేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు ఎస్పీ కళంకిత అధికారి అని, అందుకే అతన్ని బెదిరించి కేసు పెట్టడానికి సంతకం పెట్టించారన్నారు. అధికార పార్టీ నేతలు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఓ కార్యక్రమం పెట్టుకుంటే వచ్చి దాడి చేసే అధికారం వారికెవరిచ్చారని, అసలు మా మీటింగ్ తో వారికేం పని అని నిలదీశారు. అంగళ్ళకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు గుమిగూడి అల్లర్లు సృష్టించారన్నారు. ఇలాంటి వికృత చేష్టలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. జరిగిన ఘటనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, గవర్నర్ లకు లేఖలు రాస్తాననిమ్ కేంద్ర విచారణ సంస్థల దృష్టికి తీసుకు వెళతామన్నారు. నిన్న చిరంజీవి కూడా మాట్లాడితే ఏస్థాయిలో మంత్రులు విరుచుకు పడ్డారో చూసామని అన్నారు.