Sunday, January 19, 2025
HomeTrending NewsBabu: రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీ: చంద్రబాబు

Babu: రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీ: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను విచ్చలవిడిగా దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు.  దీనిలో భాగంగా సిఎం జగన్ ఓ ప్రణాళిక ప్రకారం ఇసుకను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. ఇసుక రీచ్ ల్లో ఒక మీటర్ కంటే ఎక్కువ తవ్వకూడదని, నీటిలో ఇసుక తీయకూడదని పర్యావరణ చట్టంలో స్పష్టంగా ఉంటే ఈ నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.

2021 మే  జేపీ వెంచర్స్ తో చేసుకున్న రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నారని, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వెంటనే నిలిపి వేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ఈ ఏడాది మార్చి లో తీర్పు చెప్పి 18 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేసిందని బాబు గుర్తు చేశారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితే అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలిందని, అయితే ఈ తీర్పుకు వక్రభాష్యం చెప్పి ఇది కేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమేనని, మిగతా ప్రాంతంలో తవ్వుకోవచ్చని ముందు వెళ్ళారని బాబు వెల్లడించారు.  అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఎదిరిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాజమండ్రిలో దళిత్య యువకుడి వరప్రసాద్ కు శిరోముండనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకూ 40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచుకున్నారని,  ఏడాదికి 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకానికి మాత్రమే ప్రభుత్వం  ప్రకటన ఇచ్చిందని, దీనికోసం 110 ఇసుక రీచ్ లు  ఏర్పాటు చేయగా… అనధికారికంగా మరో 500 రీచ్ లు  2022 ఆగస్ట్ నుంచి ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ఈ ఇసుక దందా మొదలు పెట్టారన్నారు. ఇటీవల తాను జొన్నవాడ రీచ్ లో ఇసుక దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టించానని పేర్కొన్నారు.

నాలుగేళ్ళుగా రాష్ట్రంలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వకాలు జరిపారో, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో లెక్కలు చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధించారు. 48 గంటలలోగా వీటికి జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్జీటీ కర్ర కాల్చి వాత పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని, తప్పులను సరిచేసుకునే ప్రయత్నం చేయలేదని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్