జీవో నంబర్ 1కు చట్టబద్ధత లేదని, అసలు ఏ చట్టం ప్రకారం ఆ జీవో తీసుకు వచ్చారో చెప్పాలని ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో పేరుతో ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, ప్రజల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. అయితే బాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఉందని అందుకే భారీ సభలను అనుమతించబోమని, కావాలంటే ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవొచ్చని పోలీసులు కండీషన్ పెట్టారు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుప్పం నియోజక వర్గంలోని పెద్దూరుకు బాబు చేరుకోగానే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుకులకు-తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఓ దశలో చంద్రబాబు సైతం తనను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ కుప్పం డీఎస్పీ సుధాకర్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు సహకరించాలని కోరడంతో చివరకు చంద్రబాబు రోడ్ షో ను మానుకొని పాదయాత్రగా ప్రజలను కలుసుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా బాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కుప్పం పర్యటన నెల రోజుల క్రితమే నిర్ణయించామని, దీనిపై డిజిపికి తాను లేఖ కూడా రాశానని వెల్లడించారు. రోడ్ షో లకు వ్యతిరేకంగా చీకటి జీవో తెచ్చారని 1861 నాటి రూల్స్ ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్, పోలీసుల దయా దాక్షిణ్యాలతో సభలు జరగాలని చూస్తున్నారని. నిన్న విజయనగరంలో వైసీపీ సభకు అనుమతించారని, కానీ తమను మాత్రం అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ పనైపోయిందని, ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, అందుకే తమ సభలకు పెద్దఎత్తున ప్రజలు వస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తిరిగే, మాట్లాడే స్వేఛ్చ ఉంటుందని, తన నియోజకవర్గంలో పర్యటించకూడదని, తన ప్రజలతో తాను మాట్లాడకూడదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : యువశక్తితో అగ్రగామి దిశగా భారత్ – చంద్రబాబు