ఎన్నికల పొత్తులు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తులు ఉంటాయని… ఏ పార్టీతో అనేది ఎన్నికల ముందు మీకే తెలుస్తుందని, ఎవరితోనైనా ఉండొచ్చని వెల్లడించారు. తెలంగాణాలో తాము పోటీ చేస్తామని, దీనిపై ఓ కమిటీ కూడా వేశామని, అయితే బిజెపితో ఇక్కడ పొత్తుకు సమయం మించి పోయిందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో బాబు చిట్ చాట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బాబు అన్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయేలతో కలిసి పని చేశామని…. ప్రత్యేక హోదా కోసమే తాము ఎన్డీయే నుంచి బైటకు వచ్చామని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చిందన్నారు. రాజకీయాల్లో జగన్ ఓ బచ్చా అని, ఆయనకున్న అనుభవం ఏమిటని, అసలు ఏపీకి ఉన్న అసలు సమస్య జగన్ అని, రాష్ట్రం బాగుపడాలంటే ఆయన్ను గద్దె దించాలని అన్నారు.
ఇండియా కూటమిపై కూడా బాబు స్పందించారు. ఈ కూటమికి నేత నేకపోవడం బిజెపికి కలిసివచ్చే అంశమన్నారు, అయితే ఎవరు నేతృత్వం వహిస్తారన్నదానిపై తానేమీ మాట్లాడబోనన్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణాలోనే ఉందని.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆపార్టీ పుంజుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.