స్కిల్ డెవలప్మెంట్ సూత్రధారి, పాత్ర దారి చంద్రబాబేనని, ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అడ్డంగా దొరికారని, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, డొల్ల కంపెనీలకు 371 కోట్ల రూపాయలు మళ్ళించి దోచుకున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడి ఈ స్కామ్ పై విచారణ చేసి కొందరిని అరెస్టు చేశారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,57,844 మంది లబ్దిదారులకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బాబు అరెస్టు ఉదంతంపై సిఎం మాట్లాడారు.
అన్ని సామాజిక వర్గాలను మోసం చేస్తూ… 45 ఏళ్ళుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకున్న చంద్రబాబు ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అడ్డంగా దొరికారని దుయ్యబట్టారు. ఇన్నేళ్ళుగా ఎన్ని దోపిడీలు చేసినా ఆయన్ను రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన దొంగాల ముఠా సభ్యులు ఉన్నారని విమర్శించారు. చట్టం ఎవరికైనా ఒకటేనని, ఆ విషయాన్ని వారికి చెప్పేవారు ఇంతకాలం లేరని, ఇప్పుడు వారికి వ్యతిరేకంగా కొంతమంది గళం విప్పేసరికి తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో కూడా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికినా… అసలు బాబు చేసింది నేరమే కాదని ఆయన వాటాదారులు పదికోట్ల మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టారని జగన్ అన్నారు. బాబు దొంగతనాల్లో వాటాదారులు కాబట్టి అప్పుడైనా, ఇప్పుడైనా ఈ నేరాలపై కొందరు వార్తలు రాయడం లేదని, ధ్వజమెత్తారు. ఆధారాలతో, వాట్సాప్ చాట్ లతో అడ్డంగా దొరికినా ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, పైగా ఆయనకే మద్దతు పలుకుతున్నాడని పవన్ పై విమర్శలు గుప్పించారు. మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటని చెత్త పలుకు రాసేది ఒకడు, బాబు అవినీతిని దాచేందుకు అష్ట కష్టాలు పడేది ఇంకొకడు, ఇంకొకరేమో నేరుగా జైలుకే వెళ్లి ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొట్టు పెట్టుకునేవారు మరొకరు అంటూ జగన్ మండిపడ్డారు.