ఉప్పాలవారిపాలెం ఘటనలు కులం, పార్టీ రంగు పూయడం శవరాజకీయాలకు తెరలేపడమేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాధిత కుటుంబానికి సాయం అందకుండా ఉండాలనే దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఉన్నారన్నారు. జరిగిన సంఘటన ఒకటైతే దానికి కులం, పార్టీ రంగు పూయడం హేయమని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మోపిదేవి మీడియాతో మాట్లాడారు. ఘటన దృష్టికి రాగానే ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంటే టిడిపి నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధలో ఉన్న ఆ కుటుంబం బలహీనతను అడ్డం పెట్టుకుని శవరాజకీయాలకు తెరలేపడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. శవాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ ధర్నా చేశాడని, ఆయన ధర్నా చేసే సమయానికే ప్రభుత్వం నుంచి చేయవలసిన సంపూర్ణ సహాయంపై సానుకూల స్పందన వచ్చిందని, ఆ సమయానికే ముద్దాయిలను అరెస్టు చేశారని, వీటిలో ఎక్కడైనా అలసత్వం జరిగితే ఖచ్చితంగా మీరు ధర్నా చేయవచ్చని కానీ కేవలం రాజకీయం కోసమే డ్రామా నడిపారని మండిపడ్డారు.
ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాక కూడా, శవాన్ని కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా ధర్నా చేశారంటే దాన్ని శవరాజకీయాలు అనక ఏమనాలని ప్రశ్నించారు. ఈ హత్యతో కులాలకు, పార్టీలకు ఏమాత్రం సంబంధం లేదని, ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యక్తిగత సంఘటన అని మోపిదేవి స్పష్టం చేశారు. స్థానిక నేతల్లో ఎవరి ప్రమేయం, ప్రోద్బలం, సహాయ సహకారాలు లేవని, చిరంజీవి అమర్నాథ్ అతి కిరాతకంగా హత్యకు గురికావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
హత్య జరిగిన నాలుగైదు గంటల్లోనే ముగ్గురు ముద్దాయిలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే ఆ కుటుంబాన్ని తాను పరామర్శించానని తెలిపారు. అమర్నాథ్ సోదరికి ఉద్యోగం కావాలని అడిగారు..ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం, ఇంటి స్థలం, ఇళ్లు కోరారని, టితో పాటు ఈ సంఘటనలో బాధ్యులైన నలుగురిపై త్వరితగతిన విచారణ చేపట్టి శిక్ష వేయాలని వారు కోరారని, వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చామని చెప్పారు. సిఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించారన్నారు.
ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు మాట్లాడిన భాషపై మోపిదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి తమ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అంటూ ఘాటుగా హెచ్చరించారు. అమర్నాథ్ హత్య ఘటనలో కులం, పార్టీ రంగు పూసి టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని, ఈ కుట్రలకు కేరాఫ్ బాబు కరకట్ట గెస్ట్ హౌస్ అని విమర్శించారు.