Sunday, September 8, 2024
HomeTrending NewsCM Jagan: ముందు స్వర్గం- తర్వాత నరకం: బాబుపై జగన్

CM Jagan: ముందు స్వర్గం- తర్వాత నరకం: బాబుపై జగన్

ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు నేడు ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ‘ఎన్టీ రామారావు సీఎం కుర్చీని వీళ్లే లాగేసుకున్నారు. వెన్ను పోటు పొడిచారు. పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు వీళ్లే కారణం అయ్యారు.  ఇదే దుర్మార్గుడు (చంద్రబాబు) ఇదే ఎన్టీఆర్ చనిపోగానే శవాన్ని లాక్కుంటారు, ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు” అంటూ బాబుపై మండిపడ్డారు. ఒక సారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు ముందు అందమైన మేనిఫెస్టో తెస్తారని,  ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేస్తారని… వెబ్ సైట్లలో కూడా దాన్ని కనపడకుండా మాయం చేస్తారని విమర్శించారు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటారని, ఎన్నికలు కాగానే ప్రజలకు నరకాన్ని చూపిస్తాని అన్నారు. అలాంటి చంద్రబాబుకు… చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వానికి  మధ్య తేడా ఎంత ఉందనేది ఆలోచన చేయాలని జగన్ కోరారు.

పుంగనూరు, అంగళ్లులో చోటు చేసుకున్న ఘటనను కూడా జగన్ ప్రస్తావించారు. తుపాకులు పెట్టుకొని పోలీసులపై దాడులు చేసి, ఓ పోలీసు సోదరుడి కన్ను పోగొట్టారని, మొత్తం 47 మంది పోలీసులపై దాడి చేశారని వెల్లడించారు.  పోలీసులు తిరిగి కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చేయాలనే దిక్కుమాలిన ఆలోచన  చంద్రబాబు చేశారని, ఇలాంటి రాజకీయాలు కేవలం ఆయనకే సాధ్యమని పేర్కొన్నారు.

‘ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయల్దేరాడు. ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నాడట. ఈ రాష్ట్రంలో తనమీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడానికి బయల్దేరాడు. దొంగ ఓట్లను తామే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నామని చెప్పడానికి ఢిల్లీకి బయల్దేరాడు… ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పలిగిన వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుట్రలకు పాల్పడే వ్యక్తి ఎవరైనా ఉంటారా?” అని జగన్ ప్రశ్నించారు.

విపక్షాలు చెబుతున్న అబద్ధాలు, మోసాలు నమ్మ వద్కందని, మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవాలని, మంచిజరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్