Sunday, November 24, 2024
HomeTrending NewsKodali Nani: ఇదే నిజమైన స్క్రిప్టు : కొడాలి నాని

Kodali Nani: ఇదే నిజమైన స్క్రిప్టు : కొడాలి నాని

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ కలిస్తే వైఎస్ జగన్  మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొడాలి నాని అభివర్ణించారు.  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 41 ఏళ్ళు పూర్తి చేసుకుందని, ఇప్పటికీ ఎన్టీఆర్ పేరును ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారని  కొనియాడారు. అయితే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో అయన సిద్దాంతాలు విస్మరించారని అన్నారు.  పేదవాడికి రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, 50రూపాయలకు హార్స్ పవర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మండల వ్యవస్థ లాంటి పరిపాలనా సంస్కరణలు కూడా ఎన్టీఆర్ తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ ను దేవుడు అని చెబుతున్న చంద్రబాబు నాడు ఆయన్ను ఎందుకు పదవి నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచారో ఇప్పటిదాకా చెప్పలేదని నాని విమర్శించారు.

తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ లు తెలుగుదేశం పార్టీని వ్యాపార సంస్థ గా మార్చుకొని కోట్లాది రూపాయలు సంపాదించారని, ఎమ్మెల్సీ, ఎంపి సీట్లు అమ్ముకున్నారని కొడాలి ఫైర్ అయ్యారు. దేవుడు, ఎన్టీఆర్ లు కలిసి స్క్రిప్టు రాశారని… పార్టీ పుట్టిన రోజు అయిన నేడే లోకేష్ కు ఎమ్మెల్సీ పదవికి కూడా చివరిరోజే కావడం నిజమైన స్క్ర్పిటు అంటూ వ్యాఖ్యానించారు. గతంలో 23 మందిని వైసీపీ నుంచి చేర్చుకుంటే 2019లో 23 సీట్లే వచ్చాయని, ఇప్పుడు నలుగురిని చేర్చుకున్నారని, వచ్చే ఎన్నికల్లో టిడిపికి వచ్చేది నాలుగు సీట్లు మాత్రమేనని నాని చెప్పారు.

అనామకులను, కొత్తవారిని, విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎమ్మెల్యేలను చేసిన ఘనత నాడు ఎన్టీఆర్ ది అయితే, పాతాళంలోకి పడిపోయిన కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర ద్వారా పునరుజ్జీవం ఇచ్చిన నేత వైఎస్ అని,  అలాంటి నేత కుమారుడు వైఎస్ జగన్ ను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే బైటకు వచ్చి పార్టీ పెట్టుకొని అధికారంలోకి తీసుకువచ్చారని… అందుకే వారు లీడర్స్ అయ్యారని, బాబువి మాత్రం ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలేనని ధ్వజమెత్తారు.

మొన్నటి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ గెలిచిందంటే అది జగన్ వదిలేసిన ఎంగిలి కూడుతోనే సాధ్యమైందని, వారిద్దరికీ  వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమని జగన్ తేల్చి చెప్పారని అందుకే టిడిపికి అమ్ముడు పోయారని అన్నారు. ఓటు వేసే ముందు కూడా జగన్ వారికి  అబద్ధాలు చెప్పలేదని, ఒక్క మాట… సీటు మీకే అని చెప్పి ఉంటే వారిద్దరూ టిడిపికి ఓటు వేసి ఉండేవారా అని నాని ప్రశ్నించారు. చంద్రబాబులా అవకాశవాద రాజకీయాలు జగన్ ఎప్పటికీ చేయరని నాని స్పష్టం చేశారు.  ఒకవేళ నిజంగా ఎమ్మెల్సీ సీటు గెలుస్తామనే ధీమా ఉంటే బిసి మహిళా అనురాధకు ఎందుకు ఇచ్చి ఉండేవారని, ఏ లోకేష్ కో ఇచ్చేవారని నాని ఎద్దేవా చేశారు.

ఈరోజు జరుగుతున్న సమావేశంలోనైనా నాడు ఎన్టీఆర్ కు ద్రోహం చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కొడాలి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్