Thursday, January 23, 2025
HomeTrending Newsఎప్పుడూ మీరోజులే కాదు: జగన్ ఫైర్

ఎప్పుడూ మీరోజులే కాదు: జగన్ ఫైర్

వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సిఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తల్లికి వందనం కోసం పిల్లల తల్లులు; రైతు భరోసా కోసం రైతన్నలు; నెలకు 1500 రూపాయల కోసం  రెండున్నర కోట్ల మంది ఆడబిడ్డలు  ఎదురు చూస్తున్నారని,,,,, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నేడు నెల్లూరులో పర్యటించిన జగన్…. అక్కడి జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించారు.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ బాబు మోసపూరిత హామీల వల్లే 10శాతం ఓట్లు అటువైపు పడి వైఎస్సార్సీపీ ఓడిపోయిందని… అంతే తప్ప తమను ప్రజలు తిరస్కరించలేదని… 40 శాతం ఓట్లు తమకు వేశారని గుర్తు చేశారు.

పిన్నెల్లిపై అక్రమంగా కేసులు పెట్టారని, ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చిందని… కానీ సిఐపై దాడి చేశారంటూ కేసుపెట్టారని,  అసలు అ సమయంలో అక్కడ పిన్నెల్లి లేరని… ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని జగన్ వివరించారు. తెలుగుదేశం పార్టీ వారు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని తెలిసి అక్కడకు వెళ్లి దాన్ని ఆపే క్రమంలో  చిన్న ఘర్షణ జరిగితే అక్కడ మరో హత్యా యత్నం కేసు నమోదు చేశారని… సీట్ దర్యాప్తు పూర్తయిన తరువాత ఈ కేసులు పెట్టారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని, వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ లు వాళ్ళ స్థాయిలో ఓ రెడ్ బుక్ పెట్టుకుంటే… ఎమ్మెల్యే, మండల, గ్రామస్థాయిల్లో కూడా వేర్వేరు రెడ్ బుక్ లు పెట్టుకొని కక్ష సాధిస్తున్నారని…. దొంగ కేసులు పెడుతున్నారని, చీనీ చెట్లు నరుకుతున్నారని… ఎమ్మెల్యేలు స్వయంగా జేసీబీలు ఎక్కి బిల్డింగ్ లు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.

చేతనైతే మంచి చేసి ప్రజల మనస్సులో చోటు సంపాదించుకోవాలి కానీ ఇలాంటి దాడులతో కాదన్నారు.  ఎల్లకాలం మీరే అధికారంలో ఉండబోరని గుర్తు పెట్టుకోవాలని, ఇదే కొనసాగితే… ప్రభుత్వం మారితే ఇదే పరిస్థితి మీ కార్యకర్యలపై జరిగితే ఏమిటని నిలదీశారు. నాయకులుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదని… పల్లెల్లో దాడులు చేస్తూ ఇదే సంస్కృతి కొనసాగిస్తే ఇంక నుండి గట్టిగా రియాక్షన్ ఉంటుందని జగన్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్