విశాఖలో పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం ప్రవర్తించిన తీరు తనతో బాధ కలిగిందని, అందుకే వారికి సంఘీభావం తెలియజెప్పడానికే ఆయన్ను కలిశాననిఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. విజయవాడలోని హోటల్ నోవాటెల్ లో పవన్ తో సమావేశం అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పవన్ ఇక్కడ ఉన్నారని తెలిసి విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. రెండు పార్టీలు ఒకే చోట మీటింగ్ పెట్టుకున్నప్పుడు సమన్వయం చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుందని, కానీ విశాఖలో జనసేన కార్యకర్తలపై దాడి చేసే తిరిగి వారిపైనే కేసులు పెట్టారన్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని చంద్రబాబు నిలదీశారు. పైశాచిక ఆనందం కోసం ఇలా చేశారని విమర్శించారు.
బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:
విశాఖలో పవన్ ఉంటే ఏం లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది?
రాజకీయ పార్టీ నాయకులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది?
వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసున్నారు
నలభై ఏళ్ళలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం.
మీడియాకు కూడా స్వేఛ్చ లేని పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి నీచమైన పార్టీని నా జీవితంలో చూడలేదు
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగించాలి
మమ్మల్ని ఎవరైనా తిడితే సిఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది
అవసరమైతే మళ్ళీ కలుస్తాం
అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పనిచేద్దాం
ఎన్నికలప్పుడు ఏమిటనేది తర్వాత సంగతి
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా?
అవసరమైతే ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సందర్భంలో, జనసేన పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఎందరో పెద్దలు తనకు సంఘీభావం తెలిపారని, ఇప్పుడు చంద్రబాబు కూడా నైతిక మద్దతు ఇచ్చారని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తుల గొంతు నలిపేస్తానంటే కుదరదన్నారు. ఈ సమయంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సిన ఆవసరం ఉందన్నారు. అవసరమైతే మరికొన్ని సార్లు కలిసి మాట్లాడుకుంటామని వెల్లడించారు,
Also Read : వెధవల్లారా…: వైసీపీ నేతలపై పవన్ నిప్పులు