Monday, January 20, 2025
HomeTrending Newsపండుగ కానుకలు ఆపేశారు: బాబు

పండుగ కానుకలు ఆపేశారు: బాబు

అధికారం ఉందన్న అహంకారం మంచిదికాదని వైసీపీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహా ఇచ్చారు.  సేవాభావం ఉన్నవారే రాజకీయాల్లో ఉండాలని, కానీ నేడు అర్హత లేని వ్యక్తులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామం నారావారి పల్లె వెళ్తున్న చంద్రబాబు తిరుపతిలో మీడియాతో ఇష్టాగోష్టి గా మాట్లాడారు.  పవన్ కళ్యాణ్ తాను ఏమి చెప్పాలనుకున్నారో నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారని ఆయన్ను వైసీపీ ఎందుకు తిడుతున్నారని బాబు ప్రశ్నించారు.

తప్పులు చేస్తూ ఎదురుదాడి ద్వారా  కప్పిపుచ్చుకుంటున్న వైసీపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు. టిడిపి కార్యకర్తలను జైల్లో పెడితే భయపడి లొంగిపోరని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని, రాష్ట్రాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి పండుగలకు కానుకలు ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికామని, సంక్రాంతికే  కాకుండా రంజాన్, క్రిస్మస్ పండుగలకు కూడా కానుకలు అందించామని గుర్తు చేశారు. ఏడాదికి 350 కోట్ల రూపాయలు దీనిపై ఖర్చు చేసి పేదల్లో పండుగ సంతోషాన్ని నింపామని,  కానీ ఈ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని, ఆ దిశగా ఆలోచన కూడా చేయడంలేదని మండిపడ్డారు.

కాగా… నారా, నందమూరి కుటుంబాలు నారావారి పల్లెలో మూడ్రోజులపాటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నాయి. చంద్రబాబు కుటుంబం గత రాత్రే స్వగ్రామానికి చేరుకోగా, నందమూరి బాలకృష్ణ ఈ మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి శుబాకాంక్షలు తెలియజేశారు. సాగు, సౌభాగ్యాలకు పట్టం కట్టే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్