Sunday, January 19, 2025
HomeTrending NewsYS Jagan: ఫేక్ ఫోటోలతో బాబు సెల్ఫీ ఛాలెంజ్: సిఎం జగన్

YS Jagan: ఫేక్ ఫోటోలతో బాబు సెల్ఫీ ఛాలెంజ్: సిఎం జగన్

అక్టోబర్ లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టారని, 20 కిలోమీటర్ల మేర సొరంగ తవ్వకం పనులు వైఎస్ ఉన్నప్పుడే పూర్తయ్యాయని, గత చంద్రబాబు హయంలో ఐదేళ్ళలో కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే తవ్వారని, తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని, మొదటి టన్నెల్ పనులు తామే పూర్తి చేశామని, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి తీరతామని జగన్  భరోసా చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ రెండో విడత నిధులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం జగన్ ప్రసంగించారు.

సెల్ఫీ ఛాలెంజ్ అంటే  నాలుగు ఫేక్ ఫోటో దిగడం కాదని చంద్రబాబును ఉద్దేశించి సిఎం జగన్ ధ్వజమెత్తారు. వారి హయంలో కట్టకుండా వదిలేసిన ఇళ్ళను తాము పూర్తి చేస్తే అక్కడకు వెళ్లి ఫొటోలు దిగి వాటితో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, పేదవారి ఇంటి ముందు నిలబడి తమ హయాంలో ఈ ఇంటికి జరిగిన మంచి ఇదీ అని బాబు చెప్పగలిగితే అది గొప్ప సెల్ఫీ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు.  గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత అన్నది బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా…  అసలు సెల్ఫీ ఛాలెంజ్ చేసే నైతిక అర్హత బాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు.

ప్రజలకు అన్ని నిజాలూ తెలుసనీ అందుకే బాబు బృందం నిజాలు దాస్తున్నారని, నిందలు-అబద్ధాలతో ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు.  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లు  ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి.. నిజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అబద్ధాల బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాబు హయంలో జన్మ భూమి కమిటీలకు, తాము నెలకొల్పిన సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థకు తేడా ఒక్కసారి గ్రహించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

ఇంటింటికీ మంచి చేయడం అభివృద్ధి అవుతుందా…  దుష్ట చతుష్టయం ఇళ్ళకు మూటలు పంపడం అభివృద్ధా?

సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయడమా… లేక బాబు బృందం భోజనం చేయడమా?

దేవుడి మీద భక్తీ అంటే విజయవాడలో నలబై గుళ్ళను కూల్చడం, మైనార్టీల మీద దేశ ద్రోహం కేసులు పెట్టడమా అని సిఎం ప్రశ్నిస్తూ ఇవే  విషయాలను బాబు బృందం వచ్చినప్పుడు నిలదీయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు అధికారులు ప్రాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్