Babu on Plenary: ఏం సాధించారని ప్లీనరీ నిర్వహించుకుంటున్నారని వైఎస్సార్సీపీని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తిరగడం కాదని దమ్ముంటే పాదయాత్ర అప్పుడు ఎలా వచ్చారో అలా ప్రజల్లోకి రావాలని సిఎం జగన్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నేడు నగరిలో జరిగిన రోడ్ షో లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ సిఎంపై తీవ్ర విమర్శలు చేశారు. నాడు ఎలా ముద్దులు పెట్టారో ఇప్పుడు కూడా అలా వస్తే ప్రజల ఆగ్రహం ఏమిటో తెలుస్తుందన్నారు. మద్యంలో విష పదార్ధాలు ఉన్నట్లు ల్యాబ్ లు ఇచ్చిన నివేదికలపై ప్లీనరీలో సమాధానం చెప్పాలన్నారు.  ప్రభుత్వంపై తాను ఒక్కడినే పోరాటం చేస్తే సరిపోదని, ప్రజలు కూడా తనతో కలిసి రావాలని, ఇంటికొకరు తన ఉద్యమంలో పాల్గొనాలని బాబు పిలుపు ఇచ్చారు. తమ హయాంలో ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, తిరుమలలో నాడు ఎన్టీఆర్ అన్నదానం మొదలు పెట్టారని, ఆ స్ఫూర్తి తోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్లు పెడితే ఈ ప్రభుత్వం ఎత్తి వేసిందని దుయ్యబట్టారు.

బీసీలకు పదవులిచ్చి సామాజిక న్యాయం చేశామని జగన్ చెప్పుకుంటున్నారని, ఓ 50 మందికి కుర్చీలు లేని ఆఫీసులు ఇచ్చినంత మాత్రాన వారికి ఏదో చేసినట్లా అని నిలదీశారు. సిఎం జగన్ నోక్కేవన్నీ ఉత్తుత్తి బటన్ లే నని, పెన్షన్లు ఎంతమందికి ఇస్తున్నారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వ హయాంలో అండగా ఉన్నామని, మళ్ళీ అధికారంలోకి రాగానే 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ నేతన్నలకు ఇస్తామని ప్రకటించారు.

Also Read : జగన్ కుమార్తెలపై చంద్రబాబు వ్యాఖ్యలు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *