రాష్ట్రంలో విపక్షాలు ఓటర్ల జాబితాలోని మార్పులు, చేర్పులపై దృష్టి సారించాయి. అధికార వైఎస్సార్సీపీ అక్రమంగా ఓట్లు చేర్పిస్తోందని, తమకు ఓటు వేయరని అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని, దీనికోసం వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి దాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపణలు చేస్తున్నాయి.
ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా పరిషత్ ప్రస్తుత, గతంలో సిఈఓలుగా పనిచేసిన ఇద్దరు కీలక అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ నిన్న ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించింది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో డెబ్భై వేల ఓట్లు తొలగించినట్లు మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆధారాలతో బైట పెట్టారని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.
మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయమై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడ, ఉరవకొండ, విశాఖలో అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించిన వివరాలను ఆయన అందించనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. ఈనెల 28న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి అపాయింట్మెంట్ కోరుతూ టిడిపి లేఖ కూడా రాసింది. మరోవైపు అక్రమాలపై సమాచార సేకరణకు టిడిపి కేంద్ర కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన బొమ్మతో వంద రూపాయల నాణేన్ని కేంద్రం ఈనెల 28న విడుదల చేయనుంది. ఈ వేడుకకు చంద్రబాబు హాజరు కానున్నారు. అదేరోజు సిఈవోను కలవాలని నిర్ణయించారు.