Sunday, September 8, 2024
HomeTrending NewsJakkampudi: బాబుది పబ్లిసిటీ స్టంట్ : జక్కంపూడి

Jakkampudi: బాబుది పబ్లిసిటీ స్టంట్ : జక్కంపూడి

ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి వ్యవహరించారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. వ్యవసాయం, రైతులపై అభిమానం ఉన్నట్లు నటించిన చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్‌ మానుకోవటం మంచిదని సూచించారు. బాబును చూసి ఉభయ గోదావరి జిల్లాల రైతులు నవ్వుకుంటున్నారని, గతంలో అసెంబ్లీలో, బహిరంగ సభల్లో తన ప్రసంగాలు ఆయన గుర్తు చేసుకుంటే మంచిదన్నారు.  ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గత చంద్రబాబు విధానానికి, తమ హయంలో ప్రవేశపెట్టిన పాలసీకి మధ్య ఎంతో తేడా ఉందని ఇప్పుడు  రైతులు లబ్ధి పొందుతున్నారుని, క్షేత్రస్థాయిలో రైతులను అడిగితే ఈ ప్రభుత్వం వల్ల ఎలా మేలు జరుగుతోందో చెబుతారని హితవు పలికారు.  రైతుకు అన్ని రకాలుగా మేలు చేకూర్చాలని  తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే  72 గంటల్లోపు కొనుగోలు చేయాలని చంద్రబాబు అల్టిమేటం ఇవ్వటం సరికాదని రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఆదివారం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు.

“చంద్రబాబు ఐదేళ్లలో రబీకి 74,69,981 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. పైగా కోట్లాది రూపాయలు బాకీ పెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు బకాయి పెట్టిన ఎరియర్స్‌ కూడా జగన్‌ గారు ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో (రబీ సీజన్‌) రూ.24,488 కోట్లు వెచ్చించి 1,31,83,454 మెట్రిక్‌ టన్నులను ప్రభుత్వం సేకరించింది. ఎక్కడ చంద్రబాబు హయాంలో సేకరించిన 74,69,981 మెట్రిక్‌ టన్నులు.. ఎక్కడ జగన్ గారి ప్రభుత్వం సేకరించిన 1,31,83,454 మెట్రిక్‌ టన్నులు. ఈ ప్రభుత్వం గతంలో కన్నా 50 లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నులు అదనంగా సేకరించింది. చంద్రబాబు హయాంలో ధాన్యం కొనుగోలుకు రూ.11 వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేసింది. అన్ని రకాలుగా రైతులకు మేలు చేశామని ఈ గణాంకాలే చెబుతున్నాయి” అంటూ జక్కంపూడి వివరించారు.

రైతుకు మేలు చేయడం కోసం తమ ప్రభుత్వం పారదర్శకంగా ఆన్‌లైన్ వ్యవస్థ తెచ్చిందని, రైతుకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకే కొనుగోలు చేస్తోందని, . ఏ రైతు నుంచి పంట వస్తోందో మిల్లర్లకు కూడా తెలియదని,  ప్రభుత్వమే రైతులకు ఎంఎస్‌పీ ధరను అందజేస్తోందని పేర్కొన్నారు.

“కొనుగోళ్లలో సీఎం జగన్ గారు సంస్కరణలు తెచ్చారు. మిలుల్లో డ్రైయర్లు పెట్టాలని.. ఆదేశాలు జారీ చేశారు. 17% మించి తేమ శాతం ఉండకూడదని నిబంధన ఉన్నా దాన్ని సడలించారు. 25% వరకు కూడా ఒక్కో శాతానికి కేవలం కేజీ చొప్పన తగ్గిస్తూ కొనుగోలు జరుపుతున్నారు. నూక శాతం కూడా గతంలో కంటే 25% నుంచి 30%కు సడలింపులు ఇవ్వటం జరిగింది. రైతులకు మేలు చేసింది దివంగత వైఎస్‌ఆర్‌ గారు ఆ తర్వాత సీఎం జగన్ గారు మాత్రమే” అంటూ రాజా తెలియజేశారు.

“ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాల వల్ల మంచి పేరు వస్తోందని చంద్రబాబు కడుపుమంట. గతంలో చంద్రబాబులా ఏమీ చేయకుండా పబ్లిసిటీ చేయటం లేదు. ఫ్లెక్సీలు వేయటం లేదు. టీవీల్లో, పేపర్లలో ప్రకటనలు ఇవ్వట్లేదు. రైతులకు మేలు చేయటానికి ప్రభుత్వం తోడుగా ఉండటంతో చంద్రబాబుకు మంట. రైతులంతా జగన్‌ గారికి జేజేలు పలుకుతున్నారు” అంటూ ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీగా పనిచేసిన ఆదిరెడ్డి బాధ్యతతో వ్యవహరించకుండా చిట్‌ఫండ్ వ్యాపారంలో ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించారని, అందుకే అప్పారావు, శ్రీనివాస్‌ను సీఐడీ అరెస్టు చేసిందని రాజా చెప్పారు, కేవలం రాజకీయ ఎజెండాతో తప్పు చేసిన టీడీపీ నాయకుల్ని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారని, తద్వారా ప్రజల ఆలోచల్ని దృష్టి మళ్లించటానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు..

RELATED ARTICLES

Most Popular

న్యూస్