రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుంగనూరు, అంగళ్ళు ఘటనలపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లకు చంద్రబాబు లేఖ రాశారు. నాలుగేళ్లలో జరిగిన ప్రధాన పరిణామాలను లేఖలో పేర్కొన్నారు. తన పర్యటనలను అడ్డుకోటమే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వివరించారు.
తన భద్రతా ప్రధానాధికారిపై నందిగామలో దాడికి పాల్పడ్డారని. ఉండవల్లిలోని తన నివాసగృహంపై డ్రోన్లు ఎగరేసి భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని ప్రస్తావించారు. తన ఇంటిపై దాడికి వచ్చిన జోగి రమేష్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ,చిత్తూరు పర్యటనలో తనపై హత్యాయత్నం చేశారని, పైగా తనపైనే హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారని వివరించారు. ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే ఈ విధ్వంస పాలనకు తెరలేపారని, ప్రజా వేదిక కూల్చివేత, ప్రధాని చేతుల మీదుగా శంఖుస్థాపన చేసిన అమరావతిని నాశనం చేయడం లాంటి నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలుజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని, నిరంకుశ పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలనూ విధ్వంసం చేస్తున్నారని, బాబు ఆవేదన వెలిబుచ్చారు. మొత్తం 9 పేజీల లేఖను బాబు రాశారు, దీనికి మరో 75 పేజీల డాక్యుమెంట్ ను, పలు వీడియోలను కూడా జత చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై జోక్యం చేసుకొని, తాను పేర్కొన్న అంశాలపై సమగ్ర ర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి చేశారు.