తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డిలు తారకరత్న ఇంట్లో ఒకరినొకరు పలకరించుకున్నారు. నందమూరి తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో శంకర్ పల్లి సమీపంలోని మోకిల గ్రామంలో తారకరత్న ఇంటికి తరలించారు. తారకరత్న భార్య అలేఖ్య విజయసాయి రెడ్డి మరదలు కూతురు అన్న సంగతి తెలిసిందే. తొలుత విజయసాయి అక్కడకు వచ్చి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాసేపటికి చంద్రబాబు కూడా అక్కడకు చేరుకున్నారు.
కొద్దిసేపు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా విజయసాయి ఆయన పక్కనే నిల్చున్నారు. విజయసాయిని కూడా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. బాబుకు వీడ్కోలు పలికి మళ్ళీ తారకరత్న ఇంట్లోకి విజయసాయి వెళ్ళారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కూడా విజయసాయి మాట్లాడి ఓదార్చారు.
రాజకీయాల్లో రెండు ప్రత్యర్ధి పార్టీలకు చెందిన, ఆ పార్టీల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరుతోన్న తరుణంలో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది.