Monday, January 20, 2025
HomeTrending Newsకన్నాను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు

కన్నాను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు

రాష్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, రాజకీయాల్లో ఉన్నవారితో పాటు లేనివారు, మేధావులు, సామాన్య ప్రజలపై కూడా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, భవిష్యత్ బాగుండాలని అనుకునే నేతలు అంతా ఒక్క తాటిపైకి రావాలని, ఈ రాక్షస పాలనను అంతమొందించడానికి కలిసి రావాలని కోరారు.  బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు… పార్టీ కండువా కప్పి కన్నాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నాతో పాటు అయన తనయుడు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు, బిజెపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అంతకుముందు గుంటూరులోని తన స్వగృహం నుంచి వేలాది అనుచరులతో భారీ ర్యాలీగా టిడిపి ఆఫీసుకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ సిద్ధాంతపరంగా పనిచేసే నాయకులు శాశ్వతంగా నిలిచిపోతారని, అలాంటి నేతల్లో కన్నా ఒకరని ప్రశంసించారు.  రాజకీయాల్లో హుందాతనం, ఒక నిబద్ధతతో ఉన్న నేత కన్నా అని, రాజకీయంగా తాను -కన్నా ఒకరినొకరం విభేదించుకున్నా వ్యక్తిగతంగా ఎన్నడూ విమర్శించుకున్న సందర్భం లేదని చెప్పారు. కన్నాను ఆదర్శంగా తీసుకుని నేతలంతా ముందుకు రావాలని కోరారు. రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉన్న నేత కన్నా అని ప్రశంసించారు. 1973 నుంచే అయన విద్యార్దినేతగా రాజకీయాల్లో ఉన్నారని, ఐదుసార్లు అయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఒకసారి పెదకూరపాడులో ఆయన్ను ఓడించాలని ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదన్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు పెంచుకునే నేతలకు కన్నా నిదర్శనమన్నారు.

తమను పెత్తందార్ల పార్టీ అంటూ సిఎం మాట్లాడుతున్నారని, పేదవారికి ఏదో చేస్తుంటే తాము అడ్డుపడుతున్నట్లు ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తాము ఏమీ చేయలేమనే నిరాసక్తత ప్రజల్లో వస్తే అది అంతిమంగా బానిసత్వానికే దారితీస్తుందని హెచ్చరించారు.

Also Read : అందుకే పార్టీ మారాను: కన్నా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్