ప్రగతి భవన్ సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అభివర్ణించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో పోరాటాలకు, ఉద్యమ కార్యక్రమాలకు తెలంగాణా భవన్ జన్మస్థలమైతే…. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎన్నో పథకాలకు పురుడు పోసుకున్న జన్మస్థలం ప్రగతి భవన్ అని అయన బండి సంజయ్ దృష్టిలో ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కావొచ్చని కానీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, బంగారు తెలంగాణా భవితకు ఈ భవనం ఒక స్ఫూర్తి అని సుమన్ అన్నారు.
సిఎం కేసిఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖపై సుమన్ స్పందించారు. బురదలో పందికి పన్నీరు వాసన ఎలా తెలియదో బడా జూటా బండికి ప్రగతి భవన్ విలువ కూడా తెలియదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ స్పూర్తిగా కేంద్రం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టిందని, అవి పురుడు పోసుకుంది కూడా ప్రగతి భవన్ లోనే అనేది గుర్తుచుకోవాలని సుమన్ అన్నారు.
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానమే కేసియార్ కు వెలకట్టలేని ఆస్తి అని, తెలంగాణ సాధించి ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడై గొప్ప పరిపాలన అందిస్తున్నారని సుమన్ అన్నారు. కేసీయార్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సక్రమ ప్రాజెక్ట్ అని స్వయంగా కేంద్ర జల్ శక్తి మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారని సుమన్ గుర్తుచేశారు.
బండి సంజయ్ రాసిన లేఖలో విషం తప్ప విషయం లేదని, మొన్ననే వినాయక నిమజ్జనం అయ్యిందని, ఇక మిగిలింది విపక్షాల నిమజ్జనమేనని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణా ప్రజలను బికారులు అంటూ లేఖలో సంజయ్ ప్రస్తావించడాన్ని బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు, వెంటనే బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.