Modified Go 317 : కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ను సవరించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. జీవోను తప్పుపట్టడం లేదని దాన్ని సవరించాలని కోరుతున్నామన్నారు. జీవో రద్దు కోరుతూ గవర్నర్ తమిలి సై ని రాజ్ భవన్ లో ఈ రోజు కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల్ని గవర్నర్ కు వివరించామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు గడిచినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని, కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా సిఎం కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఒకరోజులోనే ఆప్షన్లు పెట్టుకోవాలని, ఆ రోజే దాఖలు చేయాలని ఆదేశించటం ముఖ్యమంత్రి నియంతృత్వానికి నిదర్శనమని, ఉద్యోగసంఘాల్లో చిచ్చు పెట్టె విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల్లో పూర్తి స్థాయి అవినీతి జరుగుతోందని, సకల జనుల సమ్మె చేయటం వల్లనే కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం మరచి పోవద్దు. ఉద్యోగుల మీద కెసిఆర్ ఎందుకు కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చేందుకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు బదిలీలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు బిజెపి అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు కలిసి కట్టుగా ఉద్యమించి ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు బిజెపి పోరాడుతుందన్నారు.
Also Read : టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్