Saturday, January 18, 2025
HomeTrending Newsరైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ

రైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ

తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ 3 పేజీల బహిరంగ లేఖ, ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను బహిరంగలేఖలో అభివర్ణించిన బండి సంజయ్‌, 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనంతా రైతుల కంట కన్నీరు `కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పంట పన్నీరుగా మారిందని విమర్శించారు. లేఖలో ముఖ్యాంశాలు….

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

నమస్కారం …
విషయం: 7500 కోట్లు రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ…

రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి రైతాంగం, రైతుసంఘాలు స్వయంగా వచ్చి, మరియు ఫోన్ల ద్వారా వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బిజెపి తెలంగాణశాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రి అయిన మీకు రైతుల కష్టాలు, కడగండ్లు పట్టవు. 8 సంవత్సరాల మీ పాలనలో ‘‘రైతుల కంట కన్నీరు ` మీ ఫామ్‌హౌస్‌ పంట పన్నీరు’’ అయింది తప్ప రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ బహిరంగలేఖ ద్వారా తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురావడంతోపాటు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రైతాంగం కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలను మీ దృష్టికి, రాష్ట్ర రైతాంగం దృష్టికి తీసుకురాదలిచాం.
రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ప్రభుత్వంనుండి సకాలంలో వారికి అందాల్సిన సహాయం ముఖ్యంగా రైతుబంధు నిధులు విడుదల కాకపోవడంతో పండిరచినగిట్టుబాటు ధర లభించకపోవడం. రైతాంగం, రైతుసంఘాలు మా దృష్టికి వచ్చిన ప్రధానసమస్య. 2018 ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చిన ప్రకారం లక్షరూపాయలు రైతురుణమాఫీ అమలు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగి వారి ఆర్థిక పరిస్థితి చితికిపోయింది.
ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందక తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతుంటే వారిని గాలికొదిలేసి మీరు మాత్రం దేశవ్యాప్తంగా వ్యక్తిగత ప్రచారం, ప్రతిష్ట పెంచుకోవడం కోసం, మీ కుమారుడు మంత్రి విదేశీపర్యటనకు ప్రభుత్వ ఖజానా నుండి కోట్లరూపాయలు ఖర్చుచేస్తూన్నారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు రుణమాఫీ చేసే విషయంలో కానీ, రైతుబంధు నిధులను విడుదల చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపైన తెలంగాణ రైతాంగానికి మీరు జవాబు చెప్పాలి.
రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ వెల్లడిరచిన విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని పొలంపనులు ప్రారంభించారు అయినా ఇప్పటివరకు ప్రభుత్వం రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమచేయలేదు.
‘‘పంటకాలంలో పెట్టుబడికోసం రైతాంగం అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన అగత్యం
ఉండకూడదని ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ విడుదలచేసిన ఎన్నికలమ్యానిఫెస్టోలో పేజీ.4 లో పేర్కొన్న విషయాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాము.’’ ఈ హామీ నీటిమీద రాతలుగానే, మిగిలిపోయింది, కాగితాలకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో అమలు జరగడంలేదు.
రైతుబంధు పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ మూడ సంవత్సరాల కాలంలో కేవలం 2018 సం॥లోనే ముందస్తు ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని రైతుబంధు పథకం నిధుల్ని రైతులకు సకాలంలో మంజూరు చేశారు. 2019, 2020, 2021 సంవత్సరాల్లో రైతులకు అవసరమైన సమయంలో రైతుబంధు పథకం నిధుల్ని విడుదల చేయకుండా, విడుదల చేసిన నిధులను కూడా దఫాలవారీగా విడుదల చేసి రైతులను అనేక ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిన విషయం రాష్ట్రంలో ఏ ఒక్క రైతును అడిగినా తమగోడు చెపుతారు. ఫామ్‌హౌస్‌ లో సేదతీరే మీకు రైతులు పడుతున్న కష్టాలు అర్థంకావు.
రైతులకు వ్యవసాయపెట్టుబడికి వ్యవసాయపు సీజన్‌ ప్రారంభంలోనే డబ్బు అవసరమౌతుందన్న విషయం మీకు తెలియంది కాదు. రైతులు వ్యవసాయపెట్టుబడికి అవసరమైన సహాయం అందించాల్సిన కనీసబాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ప్రభుత్వం రైతుబంధు ఖాతాలో నిధులు జమచేయకపోతే పెట్టుబడి సహాయం కోసం రాష్ట్రంలోని రైతాంగం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్థులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రైవేటు వడ్డీవ్యాపారస్థుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న రైతులబాధలు వర్ణానాతీతం. వడ్డీవ్యాపారస్థులకు వడ్డీ చెల్లించలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా తెలంగాణలో నిత్యం జరుగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం వెంటనే తెలంగాణలో రైతుబంధు పథకానికి అర్హులైన ప్రతీఒక్క రైతు ఖాతాలో నిధులను జమచేయాలి.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు ఇటీవల కిసాన్‌సమ్మాన్‌ నిధి కింద తెలంగాణరాష్ట్రానికి అందించిన సహాయం గురించి మీ దృష్టికి తీసుకురాదలిచాను. ప్రధానమంత్రి రైతులకు అందించిన సహాయం వల్లనే వారికి కొంత ఊరట లభించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మూడెంచెల విధానాన్ని అమలు చేస్తూనే… మరోవైపు కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులను ఆదుకుంటూ వారికి భరోసా ఇస్తున్న ఘనత నరేంద్రమోడీదే. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 11 కోట్ల 30 లక్షల రైతుల ఖాతాల్లో 1 లక్షా 82 వేల కోట్ల రూపాయలను జమ చేయగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5 వేల 8 వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో ఒక్కో రైతు ఖాతాలో 20 వేల రూపాయలను కేంద్రప్రభుత్వం జమ చేసింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా తెలంగాణ రైతుల ఖాతాల్లో 580 కోట్ల రూపాయల నిధులను మే 31వ తేదీన జమచేసిన విషయం మీకు తెలిసిందే.
గోబల్స్‌కు వారసులైన మీరు, మీ టీఆర్‌ఎస్‌పార్టీ వారు ప్రతినిత్యం బిజెపి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీగారిపైన అనేక అభాండాలు వేస్తూ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావడంతోపాటు వాస్తవాలను తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలనే సదుద్ధేశ్యంతో కొన్ని అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీగారు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది ఏళ్లలో అన్ని పంటల మద్దతు ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. నిన్ననే (బుధవారం)14 పంటలకు ఎమ్మెస్పి పెంచింది. వరికి రూ.100/-లు, పత్తి రూ.350/-లు,
పల్లి రూ. 300/-లు, కందులు రూ.300/-లు, పెసర్లు రూ.480/-, తెల్లనువ్వులు రూ.523/-లు, మక్కలు రూ.92/-లు,రైతులకు అనుకూలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్రప్రభుత్వాన్ని చూసి రాష్ట్రం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని రైతులు పండిరచిన పంటకు మార్కెటింగ్‌ సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా అవకాశం ఉన్న మేరా మద్దతు ధరకు అదనంగా కొన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని బోనస్‌ అందించాలి. ఫసల్‌ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు చేయూత గా నిలబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ ను, స్కీమ్‌ ఫలితాలు రైతులకు అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా డబ్బును వెంటనే చెల్లించాలి. రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెంది, రైతే రాజు గా ఉండాలనేదే ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి లక్ష్యం. ఇప్పటికైనా మీరు ఫామ్‌హౌస్‌ వీడి ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడుస్తూ రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాము.
భూసార పరీక్షలు నిర్వహించి ఏ భూమిలో ఏ పంటలు పండుతాయో రైతులకు సూచించడానికి అనువుగా 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత సాయిల్‌ హెల్త్‌ కార్డు ఇష్యు చేయడం మొదలు పెట్టి దాదాపు దేశంలో 23 కోట్ల సాయిల్‌ హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల తెలంగాణలో నేటికీ కనీసం భూసార పరీక్షలు మొదలు కాకపోవడం శోచనీయం. మీరు ఫామ్‌ హౌస్‌ ను వదిలిపెట్టి తెలంగాణ రైతులకు మేలు జరిగేలా భూసార పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయిల్‌ హెల్త్‌ కార్డులను రైతులకు అందించాలని డిమాండ్‌ కోరుతున్నాం.
కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కిసాన్‌సమ్మాన్‌ నిధి కింద అందించిన సహాయంలాగే రాష్ట్రప్రభుత్వం కూడా 7,500 కోట్లు రైతుబంధు నిధులను వెంటనే విడుదలచేయాలని, 2018 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ప్రకారం 1 లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని ఎటువంటి జాప్యం చేయకుండా పూర్తిగా అమలు చేయడానికి తగిన నిధులను కేటాయించాలని, ఫసల్‌ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు చేయూతగా నిలబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ను, స్కీమ్‌ఫలితాలు రైతులకు అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా డబ్బును వెంటనే చెల్లించాలని, సాయిల్‌ హెల్త్‌ కార్డులను రైతులకు అందించాలని బిజెపి తెలంగాణశాఖ తరుపున కోరుతున్నాము.

అభినందనలతో …

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.

Also Read :  హైదరాబాద్ లో పోలీసు స్టేషన్ల ముట్టడికి బిజెపి పిలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్