Sunday, November 24, 2024
HomeTrending Newsమహిళలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి - బండి సంజయ్

మహిళలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి – బండి సంజయ్

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదన్నారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల, బీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. న్యూఢిల్లీల్లోని విజయ్ చౌక్ వద్ద ఈ రోజు పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.

• మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైన తరవాత పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మొట్టమొదటిసారి ప్రసంగిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం సిగ్గు చేటు. ఎందుకు బహిష్కరించారో కారణం లేదు. రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదు.

• రాష్ట్రపతి ప్రసంగం విన్న తరువాత ఎవరూ బహిష్కరించాలని కూడా అనుకోరు. రాష్ట్రపతి ప్రసంగం దేశానికి దిశా, దశ చూపేదిగా ఉన్న ప్రసంగం. గత 9 ఏళ్లలో దేశం ఏ విధంగా అభివ్రుద్ది చేశారో… రాబోయే 25 ఏళ్లలో దేశం ఎట్లా కీలకం కానుందో చెప్పారు.

• రాష్ట్రపతి ప్రసంగంలో ఏమైనా అభ్యంతరాలుంటే… ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెప్పొచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. కానీ బీఆర్ఎస్ పైకి చెబుతున్నది ఒకటి… లోపలున్నది వేరు. దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలంటే కేసీఆర్ కు ద్వేషం.

• గతంలో మైనారిటీ, ఎస్సీ వ్యక్తులను రాష్ట్రపతిని చేసిన బీజేపీ ఈసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఓడించేందుకు యత్నించింది. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేరు. మహిళా కమిషన్ లేదు. మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తారు. కోర్టుకు వెళతారు. కోర్టు చెంప చెళ్లుమన్పిస్తే తిరిగి గవర్నర్ ను పిలుస్తారు.

• అసెంబ్లీలో చర్చించే అవకాశం కేసీఆర్ ఎవ్వరికీ ఇవ్వరు. మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చిద్దాం రండి అంటూ రారు. రాష్ట్రపతి ప్రసంగిస్తుంటే బహిష్కరిస్తారు? ఎందుకు బహిష్కరిస్తున్నారో కారణం చెప్పరు.

• దేశంలో 3 కోట్ల మందికి ఇండ్లు ఇచ్చామని రాష్ట్రపతి చెప్పారు.. చర్చ జరిగితే తెలంగాణలో ఇండ్ల కోసం కేటాయించిన సొమ్మంతా దారి మళ్లించారనే అంశం చర్చకు వస్తుందని భయం. దేశమంతా ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తుంటే.. తెలంగాణలో సరిగా అమలు చేయకుండా నిధులు మళ్లిస్తున్న సంగతి బయటకు వస్తది. ఫసల్ బీమా యోజన అమలు కాకుండా రైతులను ముంచుతున్నారని తెలిసిపోతుంది. రోజ్ గార్ మేళా కింద 2.15 లక్షల ఉద్యోగాలిచ్చాం… తెలంగాణలో ఉద్యోగాలివ్వడం లేదనే సంగతి బయటకు వస్తది. పైవన్నీ చర్చకొస్తయని తెలిసి మొహం చాటేశారు.

• సంచలనం కోసమే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ కు రాజ్యాంగమన్నా, గవర్నర్ అన్నా, కోర్టులన్నా లెక్కలేదు. గౌరవించరు. రాచరిక పాలన అనుకుంటున్నడు. బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణమే దళిత, గిరిజన మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఇకపై మీ ఆటలు సాగనీయం.

• కేసీఆర్ కొడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తుంటే ఏబీవీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. రెండ్రోజులుగా వారిని ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్ లో పెట్టారు. పైనుండి ఆదేశాలున్నాయంటూ విడుదల చేయడం లేదు. మేం అడ్డుకోవాలంటే మీ తరం కాదు…

• నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా మోసం చేస్తున్నారని, వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ మంత్రిని కలవడానికి వెళితే పోలీసులు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ గూండాలు దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నారు? ప్రశ్నిస్తే కేసీఆర్ కొడుకు చిల్లర భాష ఉపయోగిస్తున్నడు.

• కేసీఆర్ కుటుంబం పర్యటిస్తుంటే…. ప్రజలు చెప్పులు నెత్తిన పెట్టుకుని పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే ఏబీవీపీ కార్యకర్తలను విడుదల చేయాలి. వాళ్లపై దాడులు చేసిన నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలి.

Also Read : కేసీఆర్…రాజ్యాంగాన్నే అవమానిస్తావా – బండి సంజయ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్