Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయిగా మారిపోయిండు. ఆయన ఫొటోతో ఎన్నికలకు వెళ్లాలంటేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తే నాశనమైపోతుందనే భయం వాళ్లకు పట్టుకుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో శనివారం ఓ హోటల్ లో జర్నలిస్టులతో ఇష్టాగోష్టి సందర్భంగా పలు అంశాలపై ముచ్చటించారు. అందులోని ముఖ్యాంశాలు….

ఆ ఫొటోతో ఎన్నికలకు వెళితే అంతే సంగతులు…

‘‘తెలంగాణలో కేసీఆర్ కుటుంబంపట్ల ప్రజలకు విసుగెత్తింది. రాష్ట్రం ఈరోజు దివాళా తీయడానికి, సర్వనాశనం కావడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అర్ధమైంది. అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతామంటే… ససేమిరా అంటున్నారు.

అన్నింట్లోనూ కేసీఆర్ కుటుంబం వాటాలడుగుతోందట…

హైదరాబాద్ లో వ్యాపారాలు చేయాలంటేనే వ్యాపారస్తులు భయపడుతున్నారు. అన్ని వ్యాపారాల్లోనూ వాటాలు, కమీషన్లు కావాలని కేసీఆర్ కుటుంబం అడుగుతోందట. కేసీఆర్ కుటుంబ అరాచకాలతో వ్యాపారస్తులు, సెటిలర్లు విసిగిపోయారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం లేదనే భావనతో చేసేదేమిలేక మిన్నుకుండిపోయారు. కానీ ఈసారి టీఆర్ఎస్ కు బీజేపీ అసలు సిసలైన ప్రత్యామ్నాయంగా మారిందనే నమ్మకం వాళ్లకు ఏర్పడింది.

పాతబస్తీని కైవసం చేసుకోబోతున్నాం…

చాలామంది పాతబస్తీలో బీజేపీకి బలం లేదు కదా… ఎన్నడూ గెలవదు కదా అని అనుకుంటున్నారు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈరోజు పాతబస్తీ లో అభివ్రుద్ధి లేకుండా ఉండటానికి ఎంఐఎం పార్టీయేనని ముస్లింలకు అర్ధమైపోయింది. ఒవైసీ కుటుంబం దశాబ్దాల తరబడి ఏ పార్టీ అధికారంలో ఉన్నా… ఆ పార్టీతో అంటకాగుతున్నా అభివ్రుద్ధి ఎందుకు జరగలేదనే చర్చ ముస్లిం ఓటర్లలో విస్త్రతంగా జరుగుతోంది. ఈసారి పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయడం ఖాయం… గెలిచే అభ్యర్ధి ఉంటే పాతబస్తీలో మైనారిటీ అభ్యర్థిని నిలబెడతాం

లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వం ద్రుష్టి సారించింది. సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 సీట్లలోపే పరిమితమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకైతే ఈసారి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే టీఆర్ఎస్ కు అమ్ముడుపోతారనే భావన జనంలో నెలకొంది.

చీకోటిపై ఈడీ దాడులతో కేసీఆర్ కుటుంబంలో ఝలక్

చీకోటి ప్రవీణ్ కుమార్ పై ఈడీ దాడులు చేసినప్పటి నుండి కేసీఆర్ కుటుంబం బయటకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. సీఎం ఢిల్లీకే పరిమితమైండు. నిత్యం టీవీల్లో, మీడియాలో ఉండే కుటుంబ సభ్యులు సైలెంట్ అయ్యారు. చీకోటి క్యాసినో దందాలు… హవాలా దందాల వెనుక వీరి పాత్రపై ప్రచారం జరుగుతోంది. 2016 ఆగస్టు 11, 12 తేదీల్లో ఇద్దరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీలంక వెళ్లి జూదమాడినట్లు…. చీకోటి ప్రవీణ్ తో కలిసి దందా నడిపినట్లు విషయం కూడా మా ద్రుష్టికి వచ్చింది. ఈ దందాలో మునిగి ఓ మంత్రి ఏకంగా ఆనాడ పంద్రాగస్టు వేడుకల్లో కూడా పాల్గొనలేదని తెలిసింది. అన్ని ఆధారాలు సేకరించిన తరువాత త్వరలోనే వివరాలను బయటపెడతాం.

కాళేశ్వరాన్ని ముంచి…జాతీయ హోదా అడగడానికి సిగ్గు లేదా…?

30 వేల కోట్లు ఖర్చయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేయడమే కాకుండా… కేసీఆర్ డూప్ ఇంజనీరింగ్ వల్ల ఆ ప్రాజెక్టు వర్షాలకు మునిగిపోయింది. వందల కోట్లు నష్టమైంది. పైగా ఇప్పటి వరకు ప్రాజెక్టుకు డీపీఆర్ ఇవ్వనేలేదు. ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ సమర్పించనేలేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని జాతీయ హోదా అడుగుతున్నారు. సిగ్గుండాలే… కేసీఆర్ నిర్వాకంవల్ల మంచిర్యాల, మంథని సహా అనేక పట్టణాలు, గ్రామాలు మునిగిపోయినయ్… లక్షల ఎకరాల పంట నష్టమైంది. దీనికంతటికీ కారణం ముమ్మాటికీ కేసీఆరే.. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాళేశ్వరం ముంపు బాధితులతో కలిసి త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవబోతున్నరు. కేసీఆర్ నిర్వాకాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లబోతున్నం. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కు సిగ్గు రావడం లేదు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి.

మాతో చాలా మంది టచ్ లో ఉన్నారు…

టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నుండి చాలా మంది నేతలు మాతో టచ్ లో ఉన్నారు. వాళ్లంతా కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారు. వాళ్లేమీ అవకాశవాదం కోసమో, పదవుల కోసమో బీజేపీలోకి రావాలని అనుకోవడం లేదు.. కేసీఆర్ పాలనతో జనం కష్టాలపాలవుతున్నరు.. వాళ్లను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నరు. వాళ్లెవరు? బీజేపీలోకి ఎప్పుడొస్తారనేది అనే వివరాలు ఇప్పుడే చెప్పలేం.

ఎవరు.. ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయించేది జాతీయ నాయకత్వమే

బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఫలానా నియోజకవర్గం పోటీ చేసే బాగుంటుందని అభిప్రాయం చెప్పే హక్కు నేతలకు ఉంది. అయితే ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలి? అసలు వాళ్లకు టిక్కెట్ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం మాత్రం జాతీయ నాయకత్వానిదే. నాతో సహా అందరికీ ఇదే వర్తిస్తుంది. మాకు నరేంద్రమోదీ, జేపీ నడ్డాలే బాస్ లు… త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమిస్తాం. అసెంబ్లీ కన్వీనర్లుగా నియమితులైన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం పనిచేయాల్సిందే.

ఈసారి యాదాద్రి నుండి భద్రకాళి వరకే ఎందుకు ఎంచుకున్నామంటే….

యాదాద్రి తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవాలయం… శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి మా ఇలవేల్పు. ఇక్కడో మీకో విషయం చెప్పాలి… కేసీఆర్ తన సొంత వ్యక్తిగత ప్రచారం కోసం అసంబద్ధంగా నిర్మాణం చేసి మూల విరాట్ ను జరిపారు. ప్రపంచంలోనే గొప్ప నిర్మాణమంటే… మంచి జరుగుతుందని హిందువులమంతా సహించాం…. కానీ ఏమైంది? వర్షాలు వస్తే గతుకులు తేలుతున్నయ్… పగళ్లు వచ్చినయ్… పరువు పోయింది. కమీషన్ల కోసం దేవుడిని కూడా వాడుకున్న కేసీఆర్ కు బుద్ది, జ్ఝానం ఇవ్వాలని మొక్కుతాను. ఈసారి పాదయాత్రలో స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళతాం. పాదయాత్రలో ప్రజా సమస్యలు, వివిధ వర్గాలతో మమేకం అవ్వడానికే 3వ విడత పాదయాత్రలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. 3వ విడత ప్రారంభ, ముగింపు సందర్భంగా మాత్రమే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. ముగింపు సభకు జేపీ నడ్డా లేదా అమిత్ షా లలో ఒకరు హాజరవుతారు. ప్రారంభ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాకపోవచ్చు. ఆ సమయంలో మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. మరో కేంద్ర మంత్రి లేదా జాతీయ నేతను ప్రారంభ సభకు ఆహ్వానిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com